గిర్రున ఏడాది తిరిగేసిన బాహుబలి - కేక పెట్టించిన మేకింగ్ వీడియో

1 year for Bahubali movie

10:18 AM ON 11th July, 2016 By Mirchi Vilas

1 year for Bahubali movie

దర్శకధీరుడు రాజమౌళి మూవీ బాహుబలికి అప్పుడే ఏడాది పూర్తయింది. సరిగ్గా సంవత్సరం క్రితం.. జూలై 10న ఈ సినిమా విడుదలయింది. సంవత్సరం క్రితం ఇదే రోజున టాలీవుడ్ లో ఓ అద్భుతం చోటు చేసుకుంది. తెలుగు సినిమా ప్రేక్షకులు పెట్టుకున్న ఏ అంచనా తప్పకుండా.. ఓ తెలుగు సినిమా అయిన బాహుబలి అద్భుతాలను సాక్షాత్కరించింది. ఓ తెలుగు సినిమాతో ఇలాంటి అసామాన్య విజయాన్ని సాధించవచ్చని, ప్రాక్టికల్ గా జక్కన్న రుజువు చేసాడు. 2015 జూలై 10న బాహుబలి ది బిగినింగ్ విడుదలై.. ఎన్నెన్నో విజయాలను సాధించింది. ఓ విధంగా సినిమాలు చూడడం మానేసిన వాళ్ళను, దశాబ్ధాల పాటు థియేటర్ల మొహం చూడని వాళ్లను కూడా.. సినిమా థియేటర్ వైపు అడుగులు వేయించిన మూవీగా బాహుబలి నిలిచింది.

ఈ సందర్భంగా.. బాహుబలి ది బిగినింగ్ కి సంబంధించిన ఓ మేకింగ్ వీడియో బాహుబలి యూనిట్ విడుదల చేసింది. ఇందులో హీరో ప్రభాస్ నుంచి.. విలన్ రానా.. హీరోయిన్స్ అనుష్క.. తమన్నాలతో పాటు కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్ పడ్డ కష్టం కూడా అంతా ఇంతా కాదనే చెప్పాలి. నిమిషం పైగా నిడివి ఉన్న ఈ వీడియో చూసిన తర్వాత, ప్రేక్షకులు ఒక విషయంలో మాత్రం ఆశ్చర్యానికి గురవుతారు. బాహుబలి ది బిగినింగ్ మూవీలో తాము చూసిన ప్రతీ సన్నివేశం గ్రాఫిక్ మాయాజాలమే అనే విషయం ప్రేక్షకులకు అర్ధమవుతుంది. అంతగా తన ఊహలను విజువలైజ్ చేసి ఆడియన్స్ కి పిచ్చెక్కించిన ఘనత రాజమౌళికి దక్కుతుంది.

టాలీవుడ్ స్థాయిని, ఖ్యాతిని దిగంతాలకు తీసుకెళ్లడంలో బాహుబలి పాత్ర ఎంతగా ఉందో ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. ఇక మరో రెండు వారాల్లో చైనాలో ఈ సినిమా సత్తా చాటనుంది. మొత్తానికి అందరూ బాహుబలి కంక్లూజన్ కోసం వేయ కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

English summary

1 year for Bahubali movie