అమరావతిలో 153 ఏళ్ల కిందట అద్భుత కట్టడం!

153 years old well in Amaravati

10:44 AM ON 22nd June, 2016 By Mirchi Vilas

153 years old well in Amaravati

ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతిలో చేస్తున్న పనులు చూస్తుంటే, నైపుణ్యం అనిపిస్తుంది. ఎందుకంటే మన ఇంజనీర్లు ఇప్పుడు మల్టీస్టోరీడ్ భవనాలు నిర్మిస్తున్నారు. తాత్కాలిక సచివాలయం వంటి నిర్మాణాలు శరవేగంగా రూపు దిద్దుకుంటున్నాయి. అయినా ఇంకా ఎక్కడో ఆలస్యం కనిపిస్తోంది. ఆధునిక యంత్రాలు, రకరకాల సిమెంట్ మిశ్రమాలు అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత కాలంలోనూ, కట్టడాల నిర్మాణానికి ఆపసోపాలు పడాల్సి వస్తోంది. కానీ అమరావతిలో నాడు నిర్మించిన ఈ బావిని చూస్తే, ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. 153 ఏళ్ల కిందట(1863లో) కేవలం రాయి పై రాయిని పేర్చి అద్భుతంగా బావిని నిర్మించి, అప్పటి నిర్మాణ దారులు ఔరా అనిపించారు.

అమరావతి మండలంలోని మల్లాదిలో బత్తినేని వారి బావి పేరుతో ఈ అద్భుత నిర్మాణం మందకు కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి పూడిక తీత పనులు జరుగుతున్నాయి. బావిలోని నీటిని మొత్తాన్ని తోడి బయటకు పోయడంతో అత్యద్భుతమైన రాతి కట్టడం రూపురేఖలు బయటపడ్డాయి. పొలం పనులకు వెళ్లే రైతులు, రైతుకూలీలు, పశుపక్ష్యాదుల దాహార్తిని తీర్చేందుకు ఎక్కడా చుక్కనీరు దొరకని ప్రదేశంలో బత్తినేని రామయ్య అనే దాత 80 అడుగుల లోతున ఈ అద్భుత జలసౌధాన్ని అప్పట్లోనే నిర్మింపజేశాడని అంటారు. బావి ఎంత తవ్వినా నీళ్లు పడకపోవడంతో ప్రధాన బావిలో మళ్లీ పిల్లబావి తవ్వించి పాతాళ గంగను ఆ అపర భగీరథుడు పైకి రప్పించాడని చెబుతారు.

నాటికీ నేటికీ ఈ బావి అన్నదాతల దాహార్తిని తీర్చడంతోపాటు, వారికి పురుగు మందుల పిచికారీ, మొక్కలు నాటుకోవడం వంటి పనులకు ఉపయోగపడుతోంది. ఈ బావికి 1983లో తొలిసారిగా పూడిక తీయించిన రామయ్య వారసులు, మళ్లీ ఇప్పుడు రాజధాని నేపథ్యంలో మరోసారి ప్రస్తుతం పూడిక తీయిస్తున్నారు. తమ వెనుకటి పెద్దలు చేయించిన ధార్మిక కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగేలా ఉదారత చూపుతున్నారు. నాటి అమరావతి ప్రాశస్త్యాన్ని ఈ బావి చాటిచెబుతోందని పలువురు అంటున్నారు.

English summary

153 years old well in Amaravati