భారీ బోనస్ తో పండగే పండగ 

66 lakh bonus to their employees

03:14 PM ON 21st December, 2015 By Mirchi Vilas

66 lakh bonus to their employees

ఏడాది అంతా పనిచేసే వేతన జీవులు పండగ వస్తోందంటే బోనస్ కోసం తహతహ లాడుతుంటారు. కొన్ని చోట్ల ఒకనెల జీతం బోనస్ గా ఇస్తే , మరికొన్నిచోట్ల 40 నుంచి 70 రోజుల జీతాన్ని బోనస్ గా ప్రకటిస్తుంటారు. అయితే అమెరికాలోని ప్రముఖ శక్తి వనరుల ఉత్పత్తి సంస్థ 'హిల్ కార్ప్' తమ ఉద్యోగులకు భారీ స్థాయిలో బోనస్ ప్రకటించి క్రిస్మస్ సంబరాలను ముందే తెచ్చి పెట్టేసింది. అందులో పనిచేస్తున్న ఒక్కో ఉద్యోగికి ఒకటికాదు రెండు కాదు ఏకంగా రూ.66,30,500 బోనస్ ప్రకటించింది. ఇది సగటున ఓఅమెరికన్ ఏడాదిలో సంపాదించే దాని కన్నారెండింతలు కావడం గమనార్హం.

ఈ విషయం తెలుసుకున్న ఆ ఉద్యోగుల ఒక్కసారిగా ఎగిరి గంతేశారు. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు.

ఓ పక్క ప్రపంచ దేశాల్లో ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పత్తి సంస్థలను అనూహ్యంగా ఎదురవుతున్న నష్టాలు తీవ్ర ఒత్తిడిలోకి నెడుతుండగా.. అదే సమయంలో హిల్ కార్ప్ మాత్రం ఈ బోనస్ ప్రకటించడంతో ప్రపంచంలోని ఇతర ఉత్పత్తి సంస్థలు కూడా ఈ భారీ బోనస్ తో విస్తుపోతున్నాయి.

ప్రముఖ బిలియనీర్ హిల్డేబ్రాండ్ కు చెందిన హిల్ కార్ప్ సంస్థ గత ఐదేళ్ల కిందటే తాను నిర్ణయించుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. ఆ సమయంలో దాదాపు రూ.20 లక్షలకు పైగా బోనస్ తోపాటు ఓ కారును కూడా తమ ఉద్యోగికి బహుమతిగా అందజేసింది. ఈ సంస్థలో మొత్తం 1,400మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇక ఈ ఏడాది కూడా తాము లక్ష్యంగా పెట్టుకున్నదానికంటే రెండింతలు చమురు ఉత్పత్తి సాధించడంతో గతంలో ఇచ్చిన బోన‌స్‌ను మూడింతలు పెంచేసింది. ఈసారి ఏకంగా ఒక్కో వ్యక్తికి రూ.66 లక్షలకు పైగా బోనస్ ప్రకటించింది.

ఇక సంస్థ అధిపతి అయిన 56 ఏళ్ల హిల్దే బ్రాండ్ ముందునుంచే తమ ఉద్యోగులతో మంచి సంబంధాలు నెరుపుతూ చక్కటి ఔదార్యంతో వ్యవహరిస్తుంటారు. దీనికి తోడు ఆయనకు సంపద సృష్టీకరణలో ఉద్యోగులు, కార్మికులు కూడా అండదండగా ఉంటారు. ఫోర్బ్స్ ప్రకటించిన జాబితా ప్రకారం ప్రస్తుతం ఆయన సంపద విలువ 5.9బిలియన్ డాలర్లు. భారత దేశంలో ఇలాంటి బోనస్ ఎప్పటికి సాధ్యమయ్యేనో అంటూ మనవాళ్ళు నిట్టూరుస్తున్నారు.

English summary

A company named Hill Corp Chairman Hilldey Brand gives a huge ammount of 66,30,500 lakhs to his employees as bonus for Christmas Festival