భక్త ప్రహ్లాద కు 84 సంవత్సరాలు

84 Years For Bhakta Prahalada

05:18 PM ON 6th February, 2016 By Mirchi Vilas

84 Years For Bhakta Prahalada

తెలుగులో మొట్టమొదటి టాకీ చిత్రం "భక్తప్రహ్లాద" . హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన ‘భక్త ప్రహ్లాద’ 1932 జనవరి 22న సెన్సార్ పూర్తి చేసుకొని, ఫిబ్రవరి 6న విడుదలైంది . ఈ చిత్ర నిర్మాణం, సెన్సారింగ్, తొలి విడుదల కూడా బొంబాయిలోనే జరిగింది. హిందీలో తొలి టాకీ ‘ఆలం ఆరా’ అర్దేషిర్‌ ఇరానీ తీశాడు. ఆయనకి తెలుగులోనూ, తమిళంలోనూ కూడా చిత్రాలు తియ్యాలనిపించిందట. హెచ్‌.ఎమ్‌.రెడ్డి తెలుగువాడు కావడంతో తెలుగు ‘భక్తప్రహ్లాద’ని , తమిళ 'కాళిదాసు'ని ఆయనకు అప్పజెప్పారు.అలా మూకీ సినిమా కాస్తా పూర్తిగా తెలుగులోనే ప్రారంభించడం మొదలై, ఇవాళ్టితో 84 ఏళ్ళు పూర్తయ్యాయి.

అప్పట్లో ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన "భక్త ప్రహ్లాద" నాటకాన్ని సురభి నాటక సమాజం వారు వేస్తుండేవారు. ఆ నాటక సమాజం వారిని బొంబాయి పిలిపించి, వారితో చర్చించి, సినిమా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని బొంబాయిలోని కృష్ణామూవీటోన్ స్టూడియోలో తీశారు. అప్పట్లో ఈ చిత్రాన్ని 20 వేల రూపాయల వ్యయంతో చిత్రీకరించారు. ఈ చిత్రం బొంబాయిలో రెండు వారాలు ఆడాక విజయవాడ (శ్రీమారుతి సినిమా హాలు), రాజమండ్రి (శ్రీకృష్ణా సినిమాహాలు)ల్లో ప్రదర్శితమైంది.కొద్ది నెలల తరువాత మద్రాసులో ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదల చేసారు.

భక్త ప్రహ్లాద చిత్రంలో లీలావతిగా నటించిన సురభి కమలాబాయికి మొదట 500 రూపాయలు పారితోషికంగా నిర్ణయించారు. కాని ఆమె నటనను హర్షించి నిర్మాత వెయ్యినూటపదహార్లు బహూకరించి రైలు ఖర్చులు కూడా ఇచ్చారట. ఇక ప్రహ్లాదుని పాత్ర పోషించిన కృష్ణారావుకు 400 రూపాయలు పారితోషికం.అప్పటికి ఆయన వయసు 9 సంవత్సరాలు. తరువాతి కాలంలో ఆర్ధికంగా చాలా ఇబ్బందులు కారణంగా తరువాత ఈయన కిరాణా కొట్టు నడుపుకున్నాడు. 2001లో సినీ ఆర్టిస్టుల సంఘం ఈయనను సన్మానించి కొంత ఆర్ధిక సహాయం అందజేశారు.

ఇక ఈ సినిమా నటీనటులు విషయానికి వస్తే

దర్శకుడు : హెచ్.ఎం. రెడ్డి
సహాయ దర్శకుడు : ఎల్.వి.ప్రసాద్
నిర్మాణ సంస్థ : భారత్ మూవీ టోన్
సినిమా నిడివి : 108 నిమిషాలు
పెట్టుబడి : 20 వేలు
తారాగణం : మునిపల్లె సుబ్బయ్య,
సురభి కమలాబాయి,
షిండే కృష్ణారావు,
ఎల్.వి.ప్రసాద్,
దొరస్వామి నాయుడు,
బీ.వి.సుబ్బారావు,
చిత్రపు నరసింహారావు


'భక్త ప్రహ్లాద' సినిమాలో మొత్తం 40 పాటలు , పద్యాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంగీతాన్ని హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి .అప్పట్లో తేరా మీద బొమ్మ సరిగా కనిపించకపోయినా, చాలా చోట్ల సరిగ్గా సినిమాలోని మాటలు వినిపించకపోయినా, అప్పట్లో ప్రేక్షకులు మాత్రం భక్త ప్రహ్లాద సినిమా చూడడం కోసం తెగ ఎగబడే వారు . సినిమా టికెట్ల బ్లాక్ మార్కెట్ వ్యవహారం ఇప్పటిది కాదు కాదు అప్పట్లోనే నాలుగు అణాల ధర కలిగిన 'భక్త ప్రహ్లాద" సినిమా టిక్కట్లను నాలుగు రూపాయలకి అమ్మినా సరే జనాలు ఎగబడి కొనేవారు.

English summary

The First Telugu full length talkie film was Bhakta Prahlada ,This movie was Directed by H. M. Reddy .Today this movie was completed 84 years today.The censor date of Bhaktha Prahlada was given in it as January 22, 1932.