రోజా వ్యవహారంపై నలుగురితో  కమిటీ 

A Committee On Roja Issue

01:12 PM ON 2nd January, 2016 By Mirchi Vilas

A Committee On Roja Issue

గడిచిన శీతాకాల సమావేశాల్లో వైసిపి ఎంఎల్ఎ , సినీ నటి రోజా సస్పెన్షన్ వ్యవహారంపై ఓ కమిటీ ఏర్పాటైంది. ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన అసెంబ్లీలోని మూడు పార్టీలకు చెందిన ముగ్గరు సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటైంది. ఈమేరకు స్పీకర్ డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు నిర్ణయం తీసుకున్నారు. 20రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని స్పీకర్ ఈ సందర్భంగా కమిటీని ఆదేశించారు.
టిడిపికి చెందిన శ్రవణ కుమార్ , వైసిపికి చెందిన శ్రీకాంత్ రెడ్డి , బిజెపి నుంచి విష్ణు కుమార్ రాజు ఇందులో సభ్యులుగా వుంటారు. శీతాకాల సమావేశాల సందర్భంగా, కాల్ మనీ వ్యవహారంలో సిఎమ్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆభియోగంపై అధికార పక్షం సిఫార్సు మేరకు ఏడాదిపాటు వైసిపి ఎం ఎల్ ఎ రోజాను సస్పెన్షన్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే.
సస్పెన్షన్ నిరసిస్తూ వైసిపి సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగడం , సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరితే, అధికారపక్షం ససేమిరా అనడం వంటి పరిణామాల నేపధ్యంలో వైసిపి అధినేత జగన్ నేతృత్వంలో ఆ పార్టీ సభ్యులు సమావేశాలను బహిష్కరించడం జరిగాయి. సమావేశాలు ముగిసాక స్పీకర్ పై వైసిపి అవిశ్వాస నోటీసు ఇవ్వడం - ఇక అసెంబ్లీలో జరిగిన ఘటనలపై సిడిలు అనధికారికంగా బయటకు రావడం, దీనిపై వైసిపి ఆరోపణలకు దిగడం కూడా జరిగాయి.
ఈ పరిణామాలపై స్పీకర్ స్పందిస్తూ ,తాను ఏపార్టీకి పక్షపాతిని కానని పేర్కొంటూ , రోజా సస్పెన్షన్ వ్యవహారంతో పాటూ అసెంబ్లీ ఘటనలకు సంబంధించి ఓ కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు. అందుకనుగుణంగా డిప్యూటి స్పీకర్ అధ్యక్షతన కమిటీ నియమించారు. 20రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

English summary