షిర్డీ సాయి హుండీలో రూ. 92 లక్షల వజ్రాలు

A devotee donates 92 lakhs diamonds in Saibaba temple

10:46 AM ON 26th April, 2016 By Mirchi Vilas

A devotee donates 92 lakhs diamonds in Saibaba temple

తిరుమల శ్రీవారి ఆలయంలో దేవుడికి నగలు, నగదు భారీ మొత్తంలో సమర్పించుకునే అజ్ఞాత భక్తులు ఎందరో ఉన్నారు. అలాగే మిగిలిన ఆలయాల్లో కూడా భారీగా హుండీలో నగదు, నగలు వేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అదే కోవలో షిర్డీలోని సాయిబాబా ఆలయ హుండీలో భారీ మొత్తంలో బంగారం, వెండితో పాటు అత్యంత విలువైన వజ్రాలు కూడా కనిపించాయి. ఎవరో అజ్ఞాత భక్తులు రెండు వజ్రాల నెక్లెస్‌లను హుండీలో వేశారు. వాటి విలువ దాదాపు రూ. 92 లక్షలు ఉంటుందని నగల వ్యాపారులు చెబుతున్నారు. షిర్డీ ఆలయ చరిత్రలోనే హుండీలో ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు రావడం ఇదే మొదటిసారి.

సాధారణంగా పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చేవారు నేరుగా ట్రస్టీలకు అందజేస్తారు. హుండీలలో ఎప్పుడూ వివిధ దేశాలకు చెందిన నాణేలు, నగదు, బంగారు, వెండి ఆభరణాల లాంటివి కనిపిస్తూ ఉంటాయి. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు భక్తులు 223 వజ్రాలను, ముత్యాలను, పగడాలను సాయిబాబాకు సమర్పించారని, వాటన్నింటి విలువ కలిపి రూ. 1.06 కోట్లు ఉంటుందని, కానీ ఈ రెండు వజ్రాల నెక్లెస్‌ల విలువ మాత్రం రూ. 92 లక్షలు ఉందని ఆలయ అకౌంట్ విభాగం అధిపతి దిలీప్ జిర్పే చెప్పారు. ఏప్రిల్ 21న హుండీలు తెరిచినప్పుడు ఈ నెక్లెస్‌లు బయటపడ్డాయి.

వీటిలో ఒకటి 6. 67 క్యారెట్లు, మరోటి 2.5 క్యారెట్లు ఉంటుందని, ఇందులోని వజ్రాలు చాలా విలువైనవని ముంబైకి చెందిన వజ్రాల నిపుణుడు నరేష్ మెహతా చెబుతున్నారు. మొత్తానికి ఆ అజ్ఞాత భక్తుడెవరో గానీ సాయికి మొక్కు తీర్చుకుని భారీ నజరానా సమర్పించాడు.

English summary

A devotee donates 92 lakhs diamonds in Saibaba temple. A devotee in Shirdi donates 92 lakhs diamond necklaces.