కన్య పరీక్ష చేయించి మరీ పెళ్లి చేసుకున్నాడు.. ఆ తరువాత..

A man did a virgin test for girl and married

10:56 AM ON 25th May, 2016 By Mirchi Vilas

A man did a virgin test for girl and married

తన భర్త పెట్టే చిత్రహింసలను ఐదేళ్లుగా భరించిన ఓ భార్య.. అవి శృతి మించడంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాయకు(పేరు మార్చాం) 2011లో విదేశాల్లో పనిచేస్తున్న ఓ సైంటిస్ట్ సంబంధం వచ్చింది. మ్యాట్రిమోని సైట్ ద్వారా పరిచయాలు పూర్తయ్యాక తాంబూలాలు కూడా మార్చుకున్నారు. ఆ తర్వాత తన కాబోయే భార్యకు ఆ సైంటిస్ట్ మొదట్లోనే దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఆమెకు ఓ పరీక్ష పెడతానని, అందులో పాసైతేనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అతను విదేశాల్లో ఉంటున్న వ్యక్తి కావడంతో ఆధునిక భావాలుంటాయని, అందువల్ల ఏదైనా వ్యక్తిత్వ వికాస పరీక్ష పెడతాడేమోనని పెళ్లికూతురు, ఆమె కుటుంబసభ్యులు అనుకున్నారు.

అయితే ఆ సైంటిస్ట్ పెట్టింది వ్యక్తిత్వ పరీక్ష కాదు ఆమె కన్యనో కాదో తెలుసుకునే వర్జిన్ టెస్ట్ చేయించుకోవాలని షరతు పెట్టాడు. ఇదేదో మంచి సంబంధమని కుటుంబసభ్యులంతా ఆనందపడిపోవడం చూసిన పెళ్ళికూతురు.. వారిని బాధ పెట్టడం ఇష్టంలేక, మనసు చంపుకుని ఆ కన్య పరీక్షకు కూడా ఒప్పుకుంది. అంతేకాక ఈ పరీక్షకు తాను(వధువు) ఒప్పుకోకపోతే తన పై ఇంకా అనుమానాలు పెరుగుతాయని భయపడ్డానని, పైగా తాంబూలాలు కూడా మార్చుకోవడంతో తన కుటుంబసభ్యులు భారీగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారని మాయ పోలీసులకు తెలిపింది. ఆ వరుడు తన అక్కచెల్లెళ్లను తోడిచ్చి రాజాజీనగర్లోని ఓ ఆస్పత్రిలో తన కాబోయే భార్యకు ఈ పరీక్ష చేయించాడు.

మాయ కన్యేనని డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వడంతో ఆ వరుడు పెళ్లి చేసుకున్నాడు. అసలు తన భర్త పెళ్ళికి ముందు వర్జిన్ టెస్ట్ ఎందుకు పెట్టాడని ఆమె ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. పెళ్లికి ముందు మాయ ఫేస్బుక్ ప్రొఫైల్ చూసిన ఆమె భర్త.. అందులో ఉన్న ఆమె స్నేహితుల ఫోటోలు చూసి తను కన్యో కాదోనని సందేహించి వర్జిన్ టెస్ట్ చేయించానని చెప్పాడట. ఇంక ఆ తరువాత పెళ్లి కూడా పూర్తయింది. అయితే, ఇక్కడనుండే నవ వధువు మాయకు కష్టాలు మొదలయ్యాయి. ఐదేళ్ళుగా ఆ సైంటిస్ట్ భర్త మాయను మానసికంగా హింసిస్తూనే ఉన్నాడు. దానికి తోడు మరింత కట్నం కావాలని అత్తమామలను వేధించడం మొదలుపెట్టాడు.

ఇంక రాను రాను ఆ శాడిస్ట్ భర్త నుంచి మాయకు వేధింపులు ఎక్కువయ్యాయి. అంతేగాక తన శాడిస్ట్ భర్త ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా అక్కడున్న విలువైన వస్తువుల్ని సీసీ కెమెరాలక్కూడా దొరక్కుండా దోచేస్తాడని, పైగా తనను కూడా అలా దొంగతనాలు చెయ్యమని ఒత్తిడి చేస్తుంటాడని మాయ తెలిపింది. ఐదేళ్ళుగా నరకం అనుభవిస్తున్న తను ఇంక చేసేదిలేక పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఐదేళ్ల క్రితం నుంచి జరిగిన సంఘటనల పై దృష్టి సారిస్తున్నారు. మాయ భర్తకు నోటీసులు పంపి ఇద్దరి నుంచీ స్టేట్మెంట్లు తీసుకుంటామని చెప్పారు. ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి వారి కాపురాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తామని పోలీసులు చెప్తున్నారు.

English summary

A man did a virgin test for girl and married