నాన్ స్టాప్ గా ప్రయాణించిన ఎయిరిండియా... ఆ రికార్డు చూస్తే మతిపోద్ది

Air India creates a record

12:38 PM ON 24th October, 2016 By Mirchi Vilas

Air India creates a record

మామూలుగా విమానాలు ప్రయాణం చూస్తూనే ఉంటాం. అయితే, భారత విమానయాన సంస్థ ఎయిరిండియా నాన్ స్టాప్ ప్రయాణంతో సరికొత్త రికార్డు సృష్టించింది. ఆగకుండా అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించిన రికార్డును సొంతం చేసుకుంది. న్యూఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో బయలుదేరిన విమానం అట్లాంటిక్ సముద్రం మీదుగా కాకుండా పసిఫిక్ మహా సముద్రం మీదుగా ప్రయాణించి ఈ ఘనత సాధించింది. నిజానికి అంట్లాంటిక్ రూటుతో పోలిస్తే పసిఫిక్ రూటు 1400 కిలోమీటర్లు ఎక్కువ. అయినా 14.5 గంటలపాటు ఆగకుండా ప్రయాణించిన ఎయిరిండియా విమానం 15,300 కిలోమీటర్లను రెండు గంటల ముందుగానే చేరుకోవడం మరోవిశేషం.

విమానం ప్రయాణిస్తున్న దిశవైపే గాలులు కూడా వీస్తుండడంతో విమాన వేగం ఒక్కసారిగా పెరిగింది. గంటకు 138కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు, 938 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న విమానానికి తోడవడంతో విమాన వేగం వెయ్యి కిలోమీటర్లు దాటింది. ఫలితంగా దూరం పెరిగినా గమ్యస్థానాన్ని రెండు గంటల ముందుగానే చేరుకుంది. ప్రపంచంలో ఇంత దూరాన్ని ఆగకుండా ప్రయాణించిన విమానంగా ఎయిరిండియా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఇటువంటి రికార్డు ఎమిరేట్స్ విమానానికి ఉంది. దుబాయ్-ఆక్లాండ్ మధ్య ఉన్న 14,120 కిలోమీటర్లను అది ఆగకుండా ప్రయాణించింది.

కాగా తాజాగా ఎయిరిండియా సృష్టించిన రికార్డు మరో రెండేళ్లపాటు చెక్కుచెదరకుండా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. సింగపూర్-న్యూయార్క్ మధ్య ఉన్న 16,500 కిలోమీటర్ల దూరానికి 2018 నుంచి నాన్ స్టాప్ విమానాలు నడిపేందుకు సింగపూర్ ఎయిర్ లైన్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఆ విమానాలు అందుబాటులోకి వచ్చే వరకు ఎయిరిండియా రికార్డుకు వచ్చిన ఢోకా ఏమీ లేదని అంటున్నారు.

English summary

Air India creates a record