తెలుగులోనే రాతలు .. తెలుగు బోర్డులు ...

Andhra Government Announces All Govt Boards Must in Telugu Language

12:08 PM ON 15th September, 2016 By Mirchi Vilas

Andhra Government Announces All Govt Boards Must in Telugu Language

'తెలుగదేలయన్న దేశంబు తెలుగు..' అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ లో ఇకపై ఎక్కడ చూసినా తెలుగే కనిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు రెండు కీలక ఉత్తర్వులను ప్రభుత్వం తెలుగు భాషలోనే జారీ చేసింది. పట్టణాలు, నగరాలలో దుకాణాలు, వాణిజ్య సముదాయాల పేర్లన్నింటినీ తెలుగులో రాసేలా చర్యలు తీసుకోవాలని కార్మిక, వాణిజ్య పన్నుల శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ప్రభుత్వ పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ పేర్ల ఫలకాలను సైతం తెలుగులోనే రాయించాలని పేర్కొంది.

దాంతోపాటు తెలుగు భాషా, సాంస్కృతిక అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై మరో ఉత్తర్వు జారీ అయింది. ప్రస్తుతం ఉన్న అధికార భాషా చట్టం స్థానంలో తెలుగు భాష ప్రాధికార చట్టాన్ని తీసుకురావడానికి, పురావస్తు, ప్రాచీన భాండాగారానికి సంబంధించిన సంస్థాగతమైన ఏర్పాట్లు చేయడం, తెలుగులో బోధనకు కార్యాచరణ రూపొందించడం కోసం కొత్తగా భాషా సాంస్కృతిక అభివృద్ధి అధ్యయన సంఘాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సంఘానికి అధ్యక్షునిగా భాషా సాంస్కృతిక శాఖ మంత్రి పల్లె రఘనాథరెడ్డిని నియమించారు. ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ , ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ , ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ , పురావస్తు శాఖ ఉన్నతాధికారి జీవీ రామకృష్ణారావు, భాషా సాంస్కృతిక శాఖ ఉన్నతాధికారి డి.విజయభాస్కర్ ను సభ్యులుగా నియమించారు.

ఈ సంఘం భాషా సాంస్కృతిక అభివృద్ధి పరమైన విషయాలను అధ్యయనం చేసి నెల రోజులలోగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. తెలుగు, సంస్కృతిని అభివృద్ధి చేయడానికి చేపట్టవలసిన కార్యక్రమాలు, కార్యాచరణ ప్రణాళిక అంశాలపై వీరు అధ్యయనం చేసి నివేదికను అందిస్తారు.తెలుగు అభివృద్ధికి, సాధికారకతకు చేపట్టవలసిన అన్ని విషయాలపైనా తమ సంఘం దృష్టి పెట్టి, నెల రోజుల్లోనే నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని మంత్రి చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: హైట్ పెరగాలంటే ఈ ఫుడ్స్ తినాల్సిందే

ఇది కూడా చూడండి: మీరు పుట్టిన నెలతో మీ మనస్తత్వం ఏంటో తెలుసుకోవచ్చు

English summary

Andhra Government Announces All Govt Boards Must in Telugu Language