రూపాయికే ఆటో ప్రయాణం

Auto ride for only one rupee

10:32 AM ON 26th May, 2016 By Mirchi Vilas

Auto ride for only one rupee

రూపాయికే కిలో బియ్యం, ఉచిత విద్యుత్, రుణ మాఫీ, ఉచిత టివి, సెల్ ఫోన్... ఇలా ఆయా ప్రభుత్వాల ప్రజాకర్షక పధకాలు చూసాం. అయితే ఓ ఆటో డ్రైవర్ ఏకంగా రూపాయికే గమ్య స్థానానికి చేర్చేస్తున్నాడు. ఇదంతా అమ్మ మీద భక్తితో... అమ్మ అంటే తమిళనాడు సిఎమ్ జయలలిత అండి బాబూ... అవును తమిళ నాట అమ్మ పేరు చెబితే చాలు.. అక్కడ చాలామందికి పూనకాలు వచ్చేస్తాయి. అందుకే 32 ఏళ్ల నాటి రికార్డును బద్దలుకొట్టి మరీ వరుసగా రెండోసారి ఆమెను గెలిపించారు. ఇప్పుడు జయలలిత విజయాన్ని ఆమె అభిమానులు పండగలా చేసుకుంటున్నారు. అందులో భాగంగానే..

కోయంబత్తూరుకు చెందిన జయ అభిమాని అయిన ఓ ఆటోడ్రైవర్ తన ఆటోలో ఎక్కే ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్లినా వాళ్ల దగ్గర నుంచి కేవలం ఒక్క రూపాయి మాత్రమే చార్జీ తీసుకుంటున్నారు. ఒక రోజులో మొత్తం 102 మందిని తాను గమ్యాలకు చేర్చి 102 రూపాయలు సంపాదించానని, ఇందుకోసం తాను ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం మానేశానని ఆటోడ్రైవర్ ఆర్ఎం మత్తివనన్ చెప్పారు. ఉదయం 6 గంటలకు ఆటో రోడ్డు మీదకు ఎక్కితే సాయంత్రం 6 గంటలకే ఆగుతుంది. జయలలిత ఆరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సందర్భంగా తాను ఆమె విజయాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నానని అంటున్నాడు.

మత్తివనన్ 1975 నుంచి అన్నాడీఎంకే కార్యకర్తగా ఉన్నాడు. గత 41 ఏళ్లుగా కోయంబత్తూరులో ఆటో నడుపుతున్నానని, ఎంజీఆర్ హయాం నుంచి పార్టీలో సభ్యుడిగా వున్నానని, జయలలిత తమిళనాడు ప్రజలకు చాలా మంచి చేశారని, అందుకే ఆమెను ప్రజలు మరోసారి గెలిపించారని వివరించాడు. ఆమె అన్నా క్యాంటీన్లలో రూపాయికే ఇడ్లీలు పెడుతున్నారని, అందుకే చాలామంది పేదలు ఉదయం టిఫిన్ చేయగలుగుతున్నారని చెప్పాడు. అమ్మ అంతమందికి సాయం చేస్తున్నారు కాబట్టి.. తాను తనకు తోచిన సాయం చేస్తున్నట్లు మత్తివనన్ అంటున్నాడు. అదండీ అభిమానం అంటే.

English summary

Auto ride for only one rupee