ఆస్కార్ రేసులో బాహుబలితో పాటు మరో చిత్రం!

Baahubali in Oscar race

05:26 PM ON 13th June, 2016 By Mirchi Vilas

Baahubali in Oscar race

భారతీయ సినిమాకు ఆస్కార్ అవార్డు అన్నది ఒక కలగానే మిగిలిపోయింది. అయితే మరోసారి ఆ అవార్డు కోసం అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈసారి కోలీవుడ్, టాలీవుడ్ చిత్రాలు ఆస్కార్ అవార్డుల పోటీకి తయారవుతున్నాయి. ఈ రెండు చిత్రాలు విశేష ప్రజాదరణ పొందడంతో పాటు ప్రపంచ సినిమా దృష్టిని తమ వైపు తిప్పుకున్నవే. అందులో ఒకటి భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కి వసూళ్లలోనూ చరిత్ర సృష్టించిన బాహుబలి చిత్రం కాగా రెండవది ఎలాంటి చెప్పుకోదగ్గ క్యాస్టింగ్ లేని అతి తక్కువ కాస్ట్ తో చాలా చిన్న చిత్రంగా రూపొంది సంచలనాలను నమోదు చేసుకున్న 'కాక్కముట్టై'.

నటుడు ధనుష్ వుండర్ మార్ ఫిలింస్, దర్శకుడు వెట్రి మారన్ గ్రాస్ రూట్, ఫాక్స్ స్టూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నవ దర్శకుడు మణికంఠ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇక విఘ్నేశ్, రమేష్ అనే నటనంటే తెలియని చిన్నపిల్లలు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడడంతో పాటు జాతీయ అవార్డులను కొల్లగొట్టిందన్న విషయం తెలిసిందే. ఇక బాహుబలి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్రహ్మాండానికే బ్రహ్మాండంగా నిలిచిన చిత్రం ఇది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన అద్భుత సృష్టి బాహుబలి.

అలా అబ్బుర పరచిన ఈ రెండు చిత్రాలు ఆస్కార్ అవార్డుల రేస్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆస్కార్ అవార్డుల నామినేషన్ కు భారతీయ చిత్రాల ఎంపిక జూరీ బృందానికి ప్రముఖ నటుడు, దర్శకుడు అమోల్ పాలేకర్ చైర్మన్ గా నియమితులయ్యారు. ఇటీవల ఆయన తన బృందంతో కలిసి హైదరాబాద్ వచ్చి 45 భారతీయ చిత్రాలను పరిశీలించి ఆస్కార్ అవార్డుల నామినేషన్ కు కొన్ని చిత్రాలను ఎంపిక చేసినట్లు సమాచారం. వాటిలో కోలీవుడ్ కు సంబంధించి కాక్కముట్టై, టాలీవుడ్ చిత్రం బాహుబలి చిత్రాలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. వీటితో పాటు అమీర్ ఖాన్ నటించిన పీకే, విశాల్ భరద్వాజ్ చిత్రం హైదర్, ప్రియాంకచోప్రా మేరీకోమ్, నీరజ్ చిత్రం మసాన్ తదితర చిత్రాలు ఉన్నట్లు సమాచారం.

88వ అస్కార్ అవార్డులకు నామినేట్ అయిన చిత్రాల వివరాలను సెప్టెంబర్ 25న అధికారకపూర్వంగా వెల్లడించనున్నారు.

English summary

Baahubali in Oscar race