స్ఫూర్తిదాయకం భీష్ముడు .... భీష్మ ఏకాదశి

Bhishma Ekadasi Information

10:04 AM ON 18th February, 2016 By Mirchi Vilas

Bhishma Ekadasi Information

మహా భారతం పేరు చెప్పగానే ముఖ్యంగా గుర్తొచ్చే వాళ్ళలో భీష్ముడు ఒకడు ... స్ఫూర్తి దాయకమైన భీష్మ పితామహుని పేరుతొ మాఘ శుక్ల ఏకాదశి ని భీష్మ ఏకాదశి గా వ్యవహరిస్తుంటాం. పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణం ఈ మూడూ, కాంతి మార్గాలు అని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ తెలిపాడు. మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి శ్రీమహావిష్ణువుకి ప్రీతికరమైన రోజు.... ఇక ఇదే రోజు భీష్మ పితామహుడు నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కాబట్టి ఈ రోజును భీష్మ ఏకాదశి అని అంటారు. ఈ విధంగా ఓ తిధిని తన పేరిట బహుమానంగా పొందిన పురాణ పురుషుడు భీష్మ పితామహుడు... తన తండ్రి శంతన ద్వారా స్వచ్చంద మరణం వరాన్ని పొందాడు భీష్ముడు .... అందుకే నలభై రోజుల పాటు అంపశయ్యపై వుండి మాఘమాస అష్టమినాడు తన ప్రాణాలను విడిచాడు. భీష్ముడు అన్ని రోజులు అంపశయ్య మీద ఎందుకున్నాడు అంటే ... ఆయనకు తాను చేసిన దోషం ఒకటి జ్ఞాపకం ఉంది, చేసిన ప్రతి దోషం శరీరంపై రాసి ఉంటుందట, అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట. ఆ దోషం ఏమిటంటే ... ద్రౌపదికి నిండు కురుసభలో వస్త్రాపహరణం జరుగుతున్నా భీష్మాచార్యుడు అడ్డుకోలేదు. అంపశయ్యపై ఉన్న భీష్ముడు వర్ణాశ్రమ ధర్మాలు, రాజ ధర్మాలు, ఆపద్ధర్మాలు, మోక్షధర్మాలు, శ్రాద్ధ ధర్మాలు, స్త్రీ ధర్మాలు, దాన ధర్మాలు ధర్మరాజుకు వివరించాడు.

శ్రీ కృష్ణ పరమాత్మ ఎదుటే ధర్మరాజుకు విష్ణు సహస్రనామాలను ఉపదేశించాడు. ఆ నామాలు నేటికీ ఎంతో ప్రాచుర్యం పొందుతున్నాయి. భీష్మ పితామహుడు ధర్మరాజు సందేహాలను తీరుస్తుంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ 'తాతా ఆనాడు నాకు అవమానం జరుగుతూ వుంటే అప్పుడు ఏమయ్యాయి ఈ ధర్మాలు?' అని ప్రశ్నించిందట. దానికి బీష్మపితామహుడు ... దుర్యోదనుడి ఉప్పు తిన్న దేహం నాది , అది నా ఆధీనంలో లేదు. నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేశాను కాబట్టే ఈ పాప ప్రక్షాళన కోసం ఇనాళ్ళూ ఈ అంపశయ్యపై పడి ఉన్నా' అని సమాధానం ఇచ్చాడట. కేవలం తండ్రికి ఇచ్చిన మాట కోసం కట్టుబడి అలా మౌనంగా ఉండిపోయాడు. 'కృష్ణ భక్తిలో ఎటువంటి కల్మషం లేదు. కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నా. అందుకు ఇప్పుడు నేను ధర్మాలను చెప్పవచ్చు' అని ద్రౌపదికి భీష్ముడు వివరించాడట.

ఇలా భక్తి, జ్ఞాన వంటివాటిలో గొప్ప కృషి చేయడం వల్లనే, ఈ నాటికీ అందరికీ భీష్మ పితామహుడు మార్గదర్శకుడిగా వున్నాడు. ఇక భీష్మ పితామహుడికి పిల్లలు లేరు, అందుకే అపుత్రుకుడిగా మరణించినప్పటికీ సంప్రదాయాన్ని పాటించే వాళ్ళు, తమ పితృదేవతలకు పితృతర్పణాలు ఇచ్చే సమయంలో భీష్మపితామహుడికి కూడా తర్పణాలు అర్పిస్తుంటారు. ఇక శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన తిథులలో ఏకాదశి ముఖ్య మైంది. అందుకే దీనికి 'హరివాసరము' అని కూడా అంటారు. కొంతమంది ఈ ఏకాదశి తిథిన ఉపవాసం వుండి భగవన్నామ స్మరణం, జపాలు, పారాయణలతో, విష్ణునామ పఠనం తో భగవంతుడికి స్మరిస్తూ ఉంటారు. భీష్మ ఏకాదశి కి అంతటి విశిష్టత వుంది.

English summary

Ekadashi is considered to be a very holy day.The Bhishma Ekadashi falls in the Uttarayana Punyakalam, which has many auspicious days dedicated to Bheeshma, like the Bhishma Ashtami and Bhishma Dwadasi.It is widely acknowledged that Bheeshma selected this period of Uttarayana Punyakalam to leave his mortal body and merge with the Supreme Power.