ఎక్కువ సెలవలు పెట్టారో... ఇక  ఇంటికే ..

Bio-Metric System In Government Offices

06:14 PM ON 2nd January, 2016 By Mirchi Vilas

Bio-Metric System In Government Offices

ఇప్పటివరకు ఉద్యోగులపై చర్యలు చేపట్టడానికి వెనుకాడుతున్న ఎపి సిఎమ్ చంద్రబాబు ఇక నుంచి కొరడా ఝాలిపించనున్నారా? అవుననే విధంగా ఆయన మాటలున్నాయి. సిఎమ్ కి జన్మభూమి ప్రోగ్రాం అంటే చెప్పలేనంత మమకారం. గతంలో జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రజలను భాగస్వామ్యం చేసి , పలు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా సిసి రోడ్లు వంటివి పూర్తిచేసారు. అధికారులు కూడా ఉరుకులు పరుగులతో జన్మభూమి కార్యక్రమంలో నిమగ్నమయ్యేవారు. ఓ విధంగా టిడిపికి ఉద్యోగులను దూరం చేసింది కూడా ఇలాంటి కార్యక్రమాలే. ఎందుకంటే బాబు వస్తే, ఇక పనిచేయలేమనే భావన వచ్చేసింది అప్పట్లో.

ఉద్యోగుల్లో నమ్మకం లేకపోవడం వల్లే రెండుసార్లు బాబు గారు ఓటమి పాలయ్యారని కూడా అనేవారు. మొత్తానికి 10 ఏళ్ళ విరామం తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన చంద్రబాబు ఇన్నాళ్ళు చాలా సాఫ్ట్ గానే వున్నారు. గోదావరి పుష్కరాలలో సైతం ఒక్క అధికారి మీద కూడా చర్య తీసుకోలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ జన్మభూమి కార్యక్రమం తెరమీదికి తేవడంతో ఆనాటి ఊపు తెచ్చేందుకు కసరత్తు మొదలైంది. మాట వినని , పనిచేయని , ఎక్కువ సెలవలు పెట్టేవాళ్ళను సాగనంపడానికి ఆయన ఇక వెనుకాడరని అంతా అంటున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి.

రాష్ట్రంలో శనివారం మూడో విడత ‘జన్మభూమి-మావూరు’ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా బొండపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే వైద్యులు సుదీర్ఘ సెలవులు పెడితే శాశ్వతంగా ఇంటికి పంపిస్తానని హెచ్చరించారు. ఆస్పత్రుల్లో హాజరు కోసం వేలిముద్రల వ్యవస్థ తీసుకొస్తామన్నారు. ఇబ్బందుల నుంచి రాష్ట్రం పూర్తిగా బయటపడలేదన్నారు. పిల్లలను బాగా చదివించుకోవాలని, ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై దృష్టి పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగా నెరవేర్చుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మొత్తానికి సిఎమ్ హెచ్చరికతో ఉద్యోగుల్లో అలజడి మొదలవుతోందని అంటున్నారు.

English summary

Andhra Pradesh Cheif Minister Nara Chandra Babu Naidu to introduce bio-metric system in All government offices in Andhra Pradesh. He started JanmaBhoomi Program in Vijayanagaram