గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్

Bonthu RamMohan Selected As GHMC Mayor

12:14 PM ON 11th February, 2016 By Mirchi Vilas

Bonthu RamMohan Selected As GHMC Mayor

రాష్ట్ర విభజన అనంతరం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి ) ఎన్నికల్లో అఖండ విజయం నమోదు చేసుకున్న టిఆర్ఎస్ తొలిసారి పాలక పగ్గాలను చేపట్టింది. మేయర్ గా బొంతు రామ్మోహన్‌ గురువారం ఎన్నికయ్యారు. డిప్యుటీ మేయర్ గా ఫసియుద్దీన్‌ ఎన్నికయ్యారు. అంతకుముందు కార్పొరేటర్ల ప్రమాణస్వీకార కార్యక్రమం కౌన్సిల్‌ హాలులో అట్టహాసంగా నిర్వహించారు.కార్పోరేటర్ల చేత ప్రిసైడింగ్‌ అధికారి రాహుల్‌ బొజ్జా ప్రమాణం చేయించారు. కొందరు కార్పొరేటర్లు తెలుగులో, మరికొందరు ఉర్దూ లో , ఇంకొందరు ఆంగ్లంలో , కొంతమంది హిందీలో ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమానికి కార్పొరేటర్లతో పాటు ఎక్స్‌ అఫీషియో సభ్యులు కూడా హాజరయ్యారు.

అనంతరం ప్రిసైడింగ్‌ అధికారి రాహుల్‌ బొజ్జా మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక నిర్వహించారు. మేయర్‌గా బొంతు రామ్మోహన్‌ పేరును 92 వ డివిజన్‌ సభ్యురాలు కవిత ప్రతిపాదించగా, డిప్యూటీ మేయర్‌ పదవికి బాబా ఫసియుద్దీన్‌ పేరును కార్పొరేటర్‌ శశికుమారి ప్రతిపాదించారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులకు ఒక్కో నామినేషన్‌ దాఖలు కావడంతో బొంతు రామ్మోహన్‌ మేయర్‌గా, ఎం.డి.బాబా ఫసియుద్దీన్‌ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైనట్లు రాహుల్‌బొజ్జా ప్రకటించారు. ధ్రువ పత్రాలు అందజేశారు. రాష్ట్రమంత్రులు మహమూద్‌ అలీ, పద్మారావు, నాయిని నర్సింహారెడ్డి, ఎక్స్‌ అఫిషియో సభ్యులు పాల్గొన్నారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఏకగ్రీవ ఎన్నికకు ఎంఐఎం మద్దతు తెలిపింది.

కాగా ఉదయం తెలంగాణ భవన్‌లో టిఆర్ఎస్ కార్పొరేటర్లంతా సమావేశమయ్యారు. అక్కడే మేయర్‌గా బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్‌ పేర్లను రాష్ట్రమంత్రి కేటీఆర్‌ అధికారికంగా అక్కడే ప్రకటించారు. ఆ తర్వాత ప్రత్యేక బస్సులో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి కార్పొరేటర్లు చేరుకున్నారు.

English summary

TRS party had created a new history in Greater Hyderabad Municipal Corporation Elections.TRS won 99 seats in GHMC elections and Yesterday TRS party had announced its Mayor Candidate Bonthu RamMohan Rao and Baba Fasiuddin as Deputy Mayor.