ఇందిర పాలన కంటే బ్రిటిష్ పాలనే బెటర్

Britain Ruling Is Better Than Indira Ruling Says Bihar Government Website

10:51 AM ON 12th January, 2016 By Mirchi Vilas

Britain Ruling Is Better Than Indira Ruling Says Bihar Government Website

దేశ ప్రజల చేత ఇందిరమ్మ అనిపించుకున్న , గరీభీ హఠావో నినాదంతో దేశ గతినే మార్చేసిన ధీర వనిత దివంగత ప్రధాని ఇందిరా గాంధి పాలన కంటే బ్రిటిష్ వారి పాలనే బాగుందా.... అవునంటూ బీహార్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓ వెబ్‌సైట్‌ పేర్కొంది. అయితే ఇది హాట్ టాపిక్ గా మారి, దుమారం రేపింది. బ్రిటీష్‌ హయాం కన్నా ఇందిరా గాంధీ పాలనే దారుణంగా ఉండేదని ఆ వెబ్ సైట్ లో పేర్కొనడంతో, ఆ రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరుపై మండిపడింది.

బీహార్‌ చరిత్రకు సంబంధించి ఆ వెబ్ సైట్ లో రాసిన వ్యాఖ్యానంలో ఇందిరా గాంధీ ‘నియంతృత్వ పాలన', ఎమర్జెన్సీ కాలంలో పాల్పడ్డ ‘అణచివేత'ను అలాగే ఆధునిక చరిత్రలో జయప్రకాశ్‌ నారాయణ్‌ (జేపీ) పాత్రను కూడా ప్రస్తావించారు. ‘ఇందిరా గాంధీ, ఆమె చిన్న కుమారుడు సంజయ్‌ గాంధీ సాగించిన నియంతృత్వ పాలనను జేపీ గట్టిగా వ్యతిరేకించారు. జెపికి అనుగుణంగా వచ్చిన ప్రజా స్పందనకు ఇందిరా గాంధీ భయంతో 1975 జూన్‌ 26న దేశంలో ఎమర్జెన్సీ విధించి, జేపీని అరెస్టు చేసి, జైలులో నెట్టింది. అదికూడా కరుడుగట్టిన నేరగాళ్లను ఉంచే తీహార్‌ జైల్లో జెపిని నిర్బంధించింది' అని వెబ్‌సైట్ పేర్కొంది.

అంతే కాదు, ‘నెహ్రూతో కలసి స్వాతంత్య్ర పోరాటం చేసిన జేపీకి, 1917లో చంపారన్‌లో బ్రిటిష్‌ వారి చేతిలో మహాత్మా గాంధీకి ఎదురైన చేదు అనుభవం కన్నా ఎక్కువ చేదు అనుభవం ఎదురైంది' అని వ్యాఖ్యానించింది. ఈ తరహా వ్యాఖ్యానాలు తమకు ఆమోదయోగ్యం కాదని బీహార్‌ కాంగ్రెస్‌ నేత చందన్‌ యాదవ్‌ మండిపడ్డారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ వద్ద లేవనెత్తుతామన్నారు.

ఇందిర పై వ్యాఖ్యల తొలగింపు ......

కాగా ఇందిరాగాంధీ నియంతృత్వ పాలన సాగించారంటూ బిహార్‌ ప్రభుత్వ వెబ్‌సైట్లో పెట్టిన వ్యాఖ్యలు రాజకీయ వివాదాన్ని సృష్టించిన నేపథ్యంలో వాటిని తొలగించారు. అయితే ఈ అంశాన్ని తొలగించింది తామేనంటూ ఎవరూ బాధ్యత వహించలేదు. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని సమాచార ప్రచార విభాగం కార్యదర్శి ప్రత్యయ అమిత్‌ స్పష్టం చేశారు. రాష్ట్రప్రభుత్వ వెబ్‌సైట్‌ను నేషనల్‌ ఇన్ఫర్మాటిక్‌ సెంటర్‌ తాజాపరిచిందని ప్రజాసంబంధాల విభాగం డైరెక్టర్‌ బిపిన్‌ కుమార్‌ సింగ్‌ చెబుతున్నారు.

ఇందిర గురించి గాని ఎమర్జెన్సీ గురించి ఎక్కడా ప్రస్తావన లేకుండా వెబ్‌సైట్‌లో మార్పులు చేశారు. ‘‘ఆధునిక భారత చరిత్రకు జేపీ చేసిన కృషి 1979లో ఆయన మరణించేంత వరకు కొనసాగింది. తొలిసారి దిల్లీలో కాంగ్రెసేతర ప్రభుత్వం జనతా పార్టీ భారీగా విజయం నమోదు చేయడానికి కారణమయిన ఉద్యమానికి ఆయన నేతృత్వం వహించారు.’’ అని ప్రస్తుతం ఆ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో నెహ్రూ కుటుంబంపై విమర్శల జడివాన కురుస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కరంగా మారింది. పివి నరసింహారావు దేశాన్ని గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కిస్తే, ఆయనకు రావాల్సిన ఖ్యాతి రాకుండా కాంగ్రెస్ చేసిందని , అలాగే డాక్టర్ మన్మోహన్ సింగ్ ని బలహీన పరిచిన ఘనత కూడా కాంగ్రెస్ దేనని ఒకప్పడు మన్మోహన్ కి మీడియా సలహాదారునిగా వ్యవహరించిన సంజయ్ బారు తాజాగా విశ్లేషించారు. మొత్తానికి కాంగ్రెస్ గడ్డుకాలం ఇంకా కొనసాగుతున్నట్లు అర్ధం అవుతోంది.

English summary

A Bihar Government website named that Britishers Ruling was better than Indira Gandhi Government.This was opposed by congress party and later that words were deleted from that websiite