కూలిన వంతెన-కొట్టుకుపోయిన బస్సులు-జనం మిస్సింగ్

British era Mumbai to Goa route bridge was collapsed

03:43 PM ON 3rd August, 2016 By Mirchi Vilas

British era Mumbai to Goa route bridge was collapsed

భారీ వర్షాల కారణంగా ఎలాంటి ఉపద్రవాలు ముంచుకొస్తాయో ప్రతిసారి మనకు తెలుస్తూనే ఉన్నా, షరామామూలే అన్నట్లు వ్యవహారం వుంది. తాజాగా భారీ వర్షాలకు మహారాష్ట్రలోని ముంబయిలో బ్రిటిష్ కాలం నాటి వంతెన కూలి ఘోర ప్రమాదం సంభవించింది. మహద్ వద్ద ముంబయి-గోవా రహదారిలో సావిత్రి నదిపై ఉన్న వంతెన గత రాత్రి కుప్పకూలింది. ప్రమాద సమయంలో వంతెనపై వెళుతున్న రెండు బస్సులు నదిలో కొట్టుకుపోయాయి. బస్సుల్లో 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే సహాయక సిబ్బంది ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. నదిలో గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

బస్సులతో పాటు మరో 8 వాహనాలు కూడా నదిలో కొట్టుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవిస్ అధికారులను ఆదేశించారు. బ్రిడ్జి కూలిన విషయం తెలుసుకున్న వెంటనే.. 4 బృందాలకు చెందిన దాదాపు 115 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లు, 12 పడవలతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాలింపు చర్యల కోసం తీరరక్షక దళం చేతక్ హెలికాప్టర్ ను కూడా రంగంలో దింపింది. సావిత్రి నదిపై కూలిన వంతెన బ్రిటిష్ కాలం నాటిదని అధికారులు తెలిపారు. పురాతన వంతెన పక్కనే మరో కొత్త వంతెన కూడా ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు కొత్త వంతెనపై నుంచి రాకపోకలు మళ్లించారు.

ముంబయి నుంచి ప్రత్యేక అధికారుల బృదం ఘటనాస్థలికి బయలుదేరింది. రాయగఢ్ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్బ్రాంతి చెందారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ అధికారులతో సమీక్ష చేస్తూ, సహాయక చర్యలను వేగంగా సాగించాలని సూచించారు.

English summary

British era Mumbai to Goa route bridge was collapsed