ఎందెందు వెతికినా.. కాల్ మనీ..

Call Money Case Investigation

10:41 PM ON 15th December, 2015 By Mirchi Vilas

Call Money Case Investigation

విజయవాడలో వడ్డీ వ్యాపారుల అరాచకాలతో వెలుగుచూసిన కాల్ మనీ వ్యవహారం ఎందెందు చూసినా, అందందే గలదన్న రీతిలో ఆంధ్రప్రదేశ్‌ని కుదిపేస్తోంది. విజయవాడలో మొదలైన పోలీసు సోదాలు రాష్ట్రమంతా పాకాయి. తీగలాగితే డొంక కదులుతోంది. ఇది విజయవాడ, గుంటూరుకి మాత్రమే పరిమితం కాలేదు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు.. అటు రాయలసీమకు కూడా విస్తరించింది.

విజయవాడలో వివిధ ప్రాంతాల్లో పోలీసులు జరిపిన దాడుల్లో ఒక్కరోజే ఏకంగా దాదాపు 40 కాల్‌మనీ గ్యాంగ్స్ వున్నట్లు తేలింది. ప్రతీ గ్యాంగ్‌లో బౌన్సర్లతోపాటు 20 మంది సభ్యులు వున్నారట. డబ్బులివ్వని వారిని బౌన్సర్లు ఎత్తుకొచ్చి ఆస్తులు రాయించుకున్నట్లు తేలింది. 92 ప్రాంతాల్లో దాడులు సాగాయి. ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. దాదాపు వందవరకు పెద్ద కాల్ మనీ గ్యాంగులున్నట్లు వినికిడి.

ప్రజాప్రతినిధులు , వారి బంధువులు ఈ వ్యవహారంలో ప్రత్యేక్షంగా వున్నారు. మరికొందరు పరోక్ష సహకారం అందిస్తున్నారు. కోట్ల రూపాయల టర్నోవర్ తో అన్ని వ్యాపారాల కన్నా లాభసాటి వ్యాపారంగా చెలామణి అవుతోంది.

ఆయా గ్యాంగ్‌లపై మూడురోజులుగా నిఘా పెట్టిన పోలీసులు, దాదాపు 57 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో అన్ని పార్టీల నేతల ప్రమేయమున్నట్లు అధికారుల వర్గాల బోగట్టా. ఎవరికీ వారు ప్రాంతాల వారీగా పంచుకుని ఈ దందా యధేచ్చగా సాగిస్తు న్నరన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే నిందితులను పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి దాడులు చేస్తున్నాయి. టిడిపి ఎం ఎల్ సి బుద్దా వెంకన్న సోదరుడు నాగేశ్వరరావు , ఓ కార్పొరేటర్ భర్త ఇలా పలువురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసారు.

పోలీసులు రంగంలోకి దిగడంతో కాల్‌మనీ వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఈ వేడి తగ్గిన తర్వాత రావచ్చని బయటకు రావచ్చని అంచనా వేసుకుంటున్నారు. అలాగే శ్రీకాకుళం. విశాఖ, తూర్పుగోదావరి, కడప, నెల్లూరు జిల్లాల్లో కాల్‌మనీ గ్యాంగ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు.

తూర్పు గోదావరి జిల్లా అనపర్తి , పెద్దాపురం , అమలాపురం , సామర్లకోట , తదితర ప్రాంతాల్లో పోలీసు దాడులు కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు , ఇలా పలు ప్రాంతాల్లో కాల్ దందా పై పోలీసు దాడులు సాగుతున్నాయి.

పేద , మధ్య తరగతి ప్రజల అవసరాలను ఆయుధంగా మలచుకుని , వేలల్లో ఇచ్చిన అప్పులకు లక్షలు గుంజుతూ , అది చాలదన్నట్లు లైంగిక వేధింపులు , ఆస్తుల స్వాధీనం వంటి ఎన్నో అరాచకాలు కాల్ మనీ ముసుగులో సాగిస్తూ, ప్రజలను పీడిస్తున్నారు. ఒక్కో ఏరియాలో ఒక్కోపేరు మీద సాగుతోన్న కాల్ మనీ దందాలో ఎంతమంది నేతలు బయటపడతారో వేచి చూడాలి.

English summary

Day by Day call money victims were rising in AP.Police rides continues on various districts of Andhra pradesh.Police rides on various financiaers in all over andhrapradesh. Police had arrested 57 members and questioning them in various ways