అసెంబ్లీలో ' కాల్ మనీ' సెగ 

Call Money Issue On Ap Assembly

11:25 AM ON 17th December, 2015 By Mirchi Vilas

Call Money Issue On Ap Assembly

సామాన్యుల అవసరాలను ఆసరా చేసుకుని కాల్ మనీ పేరిట వడ్డీ వ్యాపారుల ఆగడాలు ఆంధ్రప్రదేశ్‌ని కుదిపేస్తుంటే , ఆ సెగ అసెంబ్లీని తాగింది. ఈనెల 22 వరకు నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్‌ శీతాకాల శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే ఈ వ్యవహారంపై వైసీపీ చర్చకు పట్టుబట్టింది. అయితే ఆ పార్టీ నేతలు ప్రతిపాదించిన తీర్మానాన్ని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు.

దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విపక్ష సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకుని, కాల్‌మనీ రేపు ప్రకటన చేస్తామని చెప్పినప్పటికీ వైసిపి సభ్యులు శాంతించలేదు. ఇదే సమయంలో సిఎమ్ చంద్రబాబు, ఎమ్మెల్సీ బోడె ప్రసాద్ కలిసున్న ఫోటోలను వైసిపి అధినేత జగన్ సభలో చూపిస్తూ , కాల్ మనీ వ్యవహారంపై నిగ్గుతేల్చాలని అనడంతో టిడిపి సభ్యులు అభ్యంతరం తెల్పారు. ఈ నేపథ్యంలో సభ 10 నిమిషాలు వాయిదా పడింది.

వైసిపి తీరుపై బొండా ఉమా ధ్వజం .....

సభ వాయిదా నేపధ్యంలో మీడియా పాయింట్ దగ్గర టిడిపి ఎంఎల్ఎ బొండా ఉమా మాట్లాడుతూ వైసిపి తీరుని ఎండగట్టారు. లోపల ఒకలా , బయట మరోలా వైసిపి వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ప్రతిపక్షాన్ని ఎప్పుడూ చూడలేదని ధ్వజమెత్తారు. కాల్ మనీ వ్యవహారంపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించినా ప్రతిపక్షం వ్యవహరిస్తున్న తీరు శోచనీయమన్నారు. ఈ కేసులో పట్టుబడిన దూడల రాజేష్ ఎవరో జగన్ చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు.

మళ్ళీ అదే తీరు .....

అనంతరం సభ ప్రారంభమైనా , కాల్ మనీ పై చర్చకు వైసిపి పట్టుబడుతూ నినాదాలు చేసారు. వాయిదా తీర్మానం తిరస్కరించాక చర్చ ఏమిటని స్పీకర్ ప్రశ్నించారు. సభ సజావుగా సాగడానికి సహకరించాలని కోరారు.

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ లో చర్చ జరిగిన విధంగా ఇక్కడ కూడా చర్చ చేయడానికి నిర్ణయిస్తే, బి ఎ సి సమావేశంలో అంగీకరించి , తీరా ఇక్కడకొచ్చాక వైసిపి సభ్యులు అడ్డుతగలడం దారుణమని చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు అన్నారు. ఎం ఎల్ ఎ లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి , గొల్లపల్లి సూర్యారావు తదితరులు వైసిపి ధోరణిని తప్పుబట్టారు.

అయినా సరే వైసిపి సభ్యుల నినాదాలు కొనసాగుతూనే ఉండడంతో నినాదాలతో హోరెత్తింది. సభా సంప్రదాయాలు తెలియకుండా రూల్స్ తెలియకుండా వ్యవహరించడం తగదని యనమల అన్నారు.

నినాదాల హోరు మధ్య సభను మళ్ళీ వాయిదా వేసారు.

English summary

Andhra Pradesh Assembly sessions had started today. The opposition party Ysrcp has fired on cal money case and speaker has posponed this sessions two times