ముద్రగడ లేఖపై బాబు విస్మయం

Chandrababu Naidu Shocked On Mudragada Padmanabham Letter

11:41 AM ON 3rd March, 2016 By Mirchi Vilas

Chandrababu Naidu Shocked On Mudragada Padmanabham Letter

మాజీ మంత్రి ముద్రగడ తీవ్ర ఆరోపణలతో రాసిన లేఖపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ,  ‘ఈ లేఖ రాసింది వైసీపీ నేత జగనా లేక ముద్రగడ పద్మనాభమా’ అని  విస్మయం వ్యక్తం చేసారట. బుధవారం విజయవాడలో మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన కొంతసేపు విడిగా మంత్రులతో సమావేశమై రాజకీయ అంశాలు చర్చిస్తూ ఉండగా, ముఖ్యమంత్రికి ముద్రగడ రాసిన లేఖ అంశం ప్రస్తావనకు వచ్చింది. అంతేకాదు, ఈ లేఖను బాబు చదివి వినిపిస్తూ, ‘రెండెకరాల పేద రైతు స్థాయి నుంచి ఎదిగానని జగన్ మాదిరిగా ఆయన నా పై రాజకీయ ఆరోపణ చేస్తున్నారు . ‘నీ చీకటి డబ్బులో వాటా అడిగానా’ అని అంటున్నారు. నా మామకు వెన్నుపోటు పొడిచానని రాశారు. జన్మభూమి కమిటీల గురించి రాశారు. ఈ నెల పదో తేదీలోపు నా స్వదస్తూరీతో ఆయనకు తిరుగు సమాధానం రాసి పంపాలని షరతు విధించారు. ఈ లేఖ జగన్ రాసినట్లు ఉంది తప్ప ముద్రగడ రాసినట్లు లేదు. జగన్ తరపున ముద్రగడ నా పై రాజకీయ పోరాటం చేస్తున్నారా లేక కాపు కులం కోసం పోరాటం చేస్తున్నారా? ఒక ముఖ్యమంత్రికి రాసే లేఖేనా ఇది? రెచ్చగొట్టి సమస్యను పెద్దది చేసే వ్యూహం ఇందులో కనిపిస్తోంది తప్ప సమస్య పరిష్కారం కావాలన్న కోరిక కనిపించడం లేదు’ అని సీఎం వ్యాఖ్యానించారు. 

    ‘‘ముద్రగడకు తాను లేవనెత్తిన సమస్య పరిష్కారం పై శ్రద్ధ ఉంటే దాని పై మాట్లాడాలి. సీఎం పై రాజకీయ ఆరోపణలు ఎందుకు? ఆయన జగన్ గుప్పిట్లో ఉన్నారని ఈ లేఖతో ధ్రువపడింది. ముద్రగడ, మంద కృష్ణ ఇద్దరూ ఈ నెల పదో తేదీనే డెడ్‌లైనగా ప్రకటించారు. ఈ ఇద్దరి వెనుకా ఒకరే ఉండటం వల్లే ఒకే తేదీలతో డెడ్‌లైన్లు పెట్టారు’’ అని ఉత్తర కోస్తాకు చెందిన ఒక మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘కాపు సామాజిక వర్గ సంక్షేమం పై మనం చిత్తశుద్ధితో ఉన్నాం. మన అంకిత భావం తెలియాలనే ఏలూరులో ప్రత్యేకంగా కాపు రుణ మేళా నిర్వహించాం. ఏ పార్టీలో ఉన్నా అట్టడుగు స్ధాయిలో ఉన్న కాపులకు న్యాయం చేస్తాం. చేసింది చాలకపోతే ఇంకా చేయాలని కోరండి. తప్పులేదు. కానీ నా పై ద్వేష భావం ప్రదర్శిస్తూ వ్యక్తిగతంగా తిడితే ఎవరికి నష్టం? ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా సామాజిక సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ పనిచేస్తున్నాం’ అని బాబు వ్యాఖ్యానించారు.

1/4 Pages

 మంత్రుల కు సిఎమ్ క్లాస్ ...

     ఇక గత మూడు నాలుగు రోజులుగా ముద్రగడ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తుంటే కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఎందుకు తిప్పి కొట్టడం లేదని బాబు ప్రశ్నించారు. ‘మీరూ... నేనూ అందరం కలిసి కూర్చుని నిర్ణయాలు తీసుకొంటున్నాం. వాటిని మీరు ప్రజలకు చెప్పాలి. ఎవరైనా విమర్శలు చేస్తే సమాధానం చెప్పాలి. మౌనంగా ఉంటే మన వద్ద ఏదో తప్పుందని అనుకొంటారు’ అని ఆయన అన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు పై ఈ సందర్భంగా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘సి. రామచంద్రయ్య నన్ను పట్టుకొని నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. దానికి వర్ల రామయ్య సమాధానం ఇవ్వాలా? నువ్వు కడప జిల్లా ఇనచార్జి మంత్రివి. నీకు బాధ్యత లేదా? తప్పించుకొని తిరుగుతున్నావన్న అభిప్రాయం కలిగించవద్దు. ముందు వరసలో ఉండి మాట్లాడండి’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

English summary

Kapu Leader Mudragada Padmanabham Wrote a letter to Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu for demanding reservations and to release funds to kapu caste people.In that letter Mudragada Padmanabham made some controversial words on Chandrababu Naidu.Nara Chandrababu Naidu shocks to Mudragada Letter and says that this letter was looking like that was written by Jagan.Minister Narayana and Chinna Rajappa was fired on Mudragada for the words in that letter.