25 లక్షలిస్తే ఓసీ బీసీ అవుతాడా? ఇది నిజంగా షాకింగే!(వీడియో)

Changing OC caste to BC caste with 25 lakhs

01:37 PM ON 11th July, 2016 By Mirchi Vilas

Changing OC caste to BC caste with 25 lakhs

అవుననే విధంగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరో భారీ కుంభకోణం వెలుగుచూసింది. రూ. 25 లక్షలు తీసుకుని ఓసీలను బీసీలుగా మార్చి చూపిస్తూ.. వారికి వైద్య సీట్లను ఇప్పిస్తూ కోట్లు గడిస్తున్న మోసగాళ్లు ఓ టీవీ ఛానల్ స్టింగ్ ఆపరేషన్ కు అడ్డంగా దొరికిపోయారు. ఆ స్టింగ్ ఆపరేషన్ ప్రకారం.. ముఠా సభ్యుడు శ్రీనివాసరెడ్డి తాను గతంలో ఎవరెవరికి దొంగ కుల ధ్రువీకరణ పత్రాలను ఇప్పించిన విషయాన్ని పూస గుచ్చినట్టు వివరించాడు. వారి పిల్లలు ఎక్కడెక్కడ చదువుకుంటున్నారో కూడా తెలిపాడు.. ఈ విషయాలన్నీ సోమవారం ఉదయం నుంచి ఓ టీవీ ఛానల్ లో వచ్చాయి.

దీంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం మొదలైంది. గత సంవత్సరం ఆరేడుగురికి ఇలాగే మెడికల్ సీట్లు ఇప్పించామని, ఈ సంవత్సరం 12 మందిని చేర్చనున్నామని నింధితుడు చెప్పాడు. వరంగల్ లోని ఎన్టీఆర్ ఆరోగ్య వర్శిటీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసినందుకు త్వరపడాలని తెలిపాడు. అంతేగాక, ముందుగా అర్ధ రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని, పని అంతా అయిపోయిన తర్వాత మాత్రం డబ్బిస్తే చాలని శ్రీనివాసరెడ్డి ధీమాగా చెబుతున్నాడు. విజయవాడకు చెందిన ఓ విద్యార్థి తండ్రితో శ్రీనివాసరెడ్డి మాట్లాడటం, ఆపై హైదరాబాద్, బేగంపేటకు వచ్చి ఆయన్ను కలిసి చర్చించడం, బతిమిలాడగా బేరాన్ని రూ. 21 లక్షలకు సెట్ చేయడం వంటివి ఈ స్టింగ్ ఆపరేషన్ లో వీడియోకు చిక్కాయి.

ఈ దందాకు బీసీ సంక్షేమ శాఖల్లోని ఉద్యోగులతో పాటు రెవెన్యూ, వర్శిటీ ఉన్నతాధికారులు సహకరిస్తున్నారని, వారందరికీ తాను ముడుపులు ఇవ్వాల్సి ఉన్నందున డబ్బులు ఎక్కువగా తగ్గించలేనని శ్రీనివాసరెడ్డి చెబుతుండటం గమనార్హం. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ కుంభకోణంపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

English summary

Changing OC caste to BC caste with 25 lakhs