బెజవాడలోమాంసం నిషేధం...

Chicken was banned in Vijayawada

12:17 PM ON 8th August, 2016 By Mirchi Vilas

Chicken was banned in Vijayawada

అవునా అని మాంసం ప్రియులు ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇది నిజం. అసలే ముక్క లేకపోతే ముద్ద దిగని రోజులివి. ఇక సండే అయితే, చేపల మార్కెట్ నుంచి మటన్ షాప్ వరకు అన్నీ రోజంతా కిటకిటలాడుతాయి. ఇంట్లో వండుకున్నా.. హోటల్ కు వెళ్లినా చికెనో - మటనో కావాల్సిందే. అలాంటిది పదిహేను రోజుల పాటు ఒక సిటీలో ఎక్కడా నాన్ వెజ్ అన్నది దొరక్కపోతే ఏమవుతుంది.. ప్రజల నాలుకలు వంకర్లు తిరిగిపోతాయేమో. నాన్ వెజ్ వాడకం ఆ స్థాయికి చేరిన నేపథ్యంలో ఇలాంటి ఆంక్షలు ఏమిటి అనుకుంటున్నారా? ఇప్పుడు విజయవాడలో నాన్ వెజ్ ప్రియులకు కష్టాలు తప్పవు మరి. ప్రభుత్వం వారితో బలవంతంగా శాకాహార దీక్ష చేయించబోతోందట.

అందుకే విజయవాడలో 16 రోజుల పాటు నాన్ వెజ్ పై నిషేధం విధించారు. ఇంతకీ ఎందుకంటారా, కృష్ణా పుష్కరాల నేపథ్యంలో ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 12 నుంచి 23వరకూ పవిత్ర కృష్ణా పుష్కరాలు జరుగనున్న దృష్ట్యా ఈ నెల 9 నుంచే విజయవాడ పరిసరాల్లో మాంసం- చేపలు తదితరాల విక్రయాలను నిషేధిస్తున్నట్టు నగర కమీషనర్ వీరపాండియన్ తెలిపారు. ఈ మేరకు అన్ని కబేళాలనూ మూసివేయాలని ఆదేశాలు జారీ చేసిన ఆయన హోటళ్లలో సైతం మాంసాహారాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. 25వ తేదీ వరకూ ఈ నిబంధన అమల్లో ఉంటుంది.

నగరానికి వచ్చే యాత్రికుల మనోభావాలను వ్యాపారులు అర్థం చేసుకుని సహకరించాలని కమీషనర్ కోరారు. ఇక ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. కాగా సముద్ర తీర జిల్లా కావడం... కొల్లేరు సరస్సు ఉండడం.. నగరంలోంచి కృష్ణా నది ప్రవహిస్తుండడం... జిల్లాలో చేపల - రొయ్యల చెరువులు విస్తారంగా ఉండడం.. వంటి అనేక కారణాల వల్ల విజయవాడలో చేపల వినియోగం అధికంగా ఉంటుంది. ఇక చికెన్ - మటన్ వినియోగం కూడా ఎక్కువే.

ఈ క్రమంలో నిషేధం కారణంగా 16 రోజుల పాటు వీరి వ్యాపారాలన్నీ దెబ్బతింటాయి. తీవ్ర ప్రభావం పడబోతోంది. అంతేకాదు. చాలామంది ఉపాధికి కూడా ఇబ్బంది ఏర్పడనుంది. మరోవైపు విజయవాడ ప్రజలు కూడా ముక్క తినకుండా అన్ని రోజులు ఎలా ఉండగలం అంటున్నారట. గోదావరి పుష్కరాలలో కూడా ఈ నిబంధన విధించిన సంగతి తెల్సిందే.

English summary

Chicken was banned in Vijayawada