మంత్రి నారాయణను క్రిమినల్ కేసు వెంటాడుతోందా .... 

Crminal Case On A.p.Minister Narayana

11:50 AM ON 26th December, 2015 By Mirchi Vilas

Crminal Case On A.p.Minister Narayana

ఎపి కేబినెట్ లో కీలక భూమిక వహిస్తున్న మున్సిపల్ మంత్రి నారాయణ పాత కేసు వెంటాడుతోందన్న వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో ఏమో గానీ ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. నారాయణ విద్యా సంస్థల అధిపతి అయిన నారాయణ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి కి వెన్ను దన్నుగా నిలిచి , అవసరమైన ఆర్ధిక వనరుల సమకూర్చడం వల్లనే , ఎంఎల్సి గా నామినేట్ చేసి , అమాత్య పదవి కట్ట బెట్టినట్లు అందరూ చెబుతుంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో చక్రం కూడా తిప్పుతున్న నారాయణ ఇటీవలే మరో మంత్రి గంటా శ్రీనివాసరావుతో వియ్యం అందారు. పార్టీలో , ప్రభుత్వంలో కీలక పాత్ర వహిస్తున్న నారాయణ ఇప్పుడు ఇబ్బందుల్లో పడబోతున్న వార్తలు షికారు చేస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే , గతంలో నారాయణపై క్రిమినల్ కేసు వుందట. అది ఎన్నికల అఫిడవిట్ లో పెర్కొనలేదట. ఈ క్రిమినల్ కేసును ప్రోబ్ అనే సంస్థ తాజాగా తవ్వి తీస్తోంది. వాటిని ప్రస్తావిస్తూ ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్రోబ్ ఫిర్యాదు ప్రకారం - 2010లో కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించి, పుస్తకాలు ప్రింటుచేసి, అమ్మినందుకు తెలుగు అకాడమీ హైదరాబాద్ నారాయణగూడ పోలీసుస్టేషన్‌లో క్రైమ్‌నెంబర్ 356తో అప్పటి నారాయణ విద్యా సంస్థల అధిపతిగా ఉన్న పి. నారాయణపై క్రిమినల్ కేసు నమోదుచేసింది. ఐదు కీలకమైన పాఠ్య విభాగాలకు సంబంధించి పంపిణీ, ముద్రణ బాధ్యతలను ఇంటర్‌బోర్డు, ప్రభుత్వం తెలుగు అకాడమికి అప్పగించింది. ఆ ప్రకారంగా కాపీరైట్ హక్కులన్నీ అకాడమీకే చెందుతాయి. అయితే, నారాయణ విద్యాసంస్థల అధిపతిగా ఉన్న ఇప్పటి మంత్రి నారాయణ దానిని ఉల్లంఘించి, ఆయన ఎండీగా ఉన్న నైమిష మల్టీమీడియా ప్రైవేట్ లిమిటెడ్, తెలుగు అకాడమీకి చెందిన స్టడీ మెటీరియల్‌ను అక్రమంగా మళ్లీ ముద్రించి అమ్ముకుంది. ఇది ఇండియన్ కాపీరైట్-1957 చట్టం ప్రకారం తీవ్రమైన నేరమని ప్రోబ్ సంస్ధ తాజాగా ఎన్నికల సంఘానికి వివరించింది.

నారాయణ విద్యాసంస్థల యాజమాన్యంపై అకాడమీ అధికారుల ఫిర్యాదు మేరకు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి మంత్రి అయిన నాటి నారాయణ విద్యాసంస్థల అధినేత పి.నారాయణ, పి. దేవి, పి.సింధూరను ఏ1,ఏ2,ఏ3లుగా కేసులు నమోదు చేశారు. నారాయణగూడ పోలీసుస్టేషన్‌లో ఆ కేసు ఇంకా కొనసాగుతోంది. కోర్టు నుంచి ఎలాంటి వెసులుబాటు, ఊరట లభించలేదని ఫిర్యాదుదారు అంటున్నారు కాగా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గవర్నర్ కోటా అభ్యర్ధిగా నారాయణ నామినేషన్ దాఖలు చేసినప్పుడు, ఈ వాస్తవాలను తన అఫిడవిట్‌లో పేర్కొనలేదని, ఇది ఒక విధంగా మోసం చేయడమేనని ప్రోబ్ సంస్థ తన ఫిర్యాదులో ఆరోపించింది.

ఇక ఎన్నికల సంఘాన్ని ఉద్దేశపూర్వకంగా మోసం చేయడమే కాకుండా, ఎన్నికల నిబంధనలను కావాలని ఉల్లంఘించడమేనని అంటూ అందుకు ఆయనను అనర్హుడిగా ప్రక టించాలని కోరుతూ ప్రోబ్ సంస్థ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది.. ఎన్నికల్లో పోటీ చేసే ఏ అభ్యర్ధి అయినా, తన నేరచరిత్ర గురించి ఫారం -26లో పేర్కొ నాలని ఎన్నికల నిబంధన స్పష్టం చేస్తోంది. అలా కాదని తమ నేరాలను దాచిపెట్టినట్టయితే, సదరు అభ్యర్థి ఒకవేళ గెలిచినా తర్వాత అతనిపై అనర్హత వేటు వేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఇప్పుడు నారాయణ తనపై ఉన్న క్రిమినల్ కేసును దాచిపెట్టడం వివాదంగా మారనుంది.

గోదావరి పుష్కరాల్లో , రాజధాని భూసేకరణలో 'సర్వం నారాయణ ' అంటూ వ్య్వవహరించిన మంత్రి నారాయణ పై కొందరు తెలుగు తమ్ముళ్ళు గుర్రుగా వున్నారని అందుచేత ఇదే అదనుగా కొందరు తెరవెనుక పావులు కడుపుతున్నరన్న మాటలు వినిపిస్తున్నాయి. ...

మరి ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో దూసుకుపోతున్న మంత్రి నారాయణ పై వస్తున్న క్రిమినల్ కేసు ఆరోపణలు నిజమా , ఒకవేళ నిజమైతే ,దీన్నుంచి ఎలా బయటపడతారో నని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

English summary