క్రైమ్ స్టోరీ చూసి అత్తను లేపేసింది.. పోలీసులకే దిమ్మ తిరిగిపోయింది!

Daughter in law killed mother in law in Amalapuram

05:21 PM ON 8th September, 2016 By Mirchi Vilas

Daughter in law killed mother in law in Amalapuram

సినిమాలు చూసి పాడైపుతున్నారని గతంలో కొందరు అనేవారు. ఇప్పుడూ అదే మాట వినిపిస్తూ ఉంటుంది. అయితే సినిమాలే కాదు, నేరుగా ఇంట్లో టీవీలో వచ్చే సీరియల్స్ కూడా నేరాలకు పురికొల్పుతున్నాయని తూర్పుగోదావరిలో జరిగిన ఓ హత్య నిరూపిస్తోంది. బంగారు ఆభరణాలపై వ్యామోహంతో అత్తకు మత్తుమందు ఇచ్చి మట్టుబెట్టిన కోడలితో సహా ఇద్దరు మహిళలు, మరో వ్యక్తిని అమలాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వృద్ధురాలి హత్య ఘటనలో ఇద్దరు మహిళలు వ్యూహాత్మక నేరప్రవృత్తిని చూసి పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది.. గత నెల 24న అమలాపురంలోని గన్నవరపువారి వీధిలో వృద్ధురాలైన అత్తకు మత్తు మందు ఇచ్చి దోపిడీకి పాల్పడిన ఘటనలో కోడలు గన్నవరపు వెంకటపద్మావతి(35), ఆమె వదిన కందెపు దేవిరెడ్డి అలియాస్ దివ్య(35) భర్త శివచెన్నకేశవరావులను బుధవారం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 25 కాసుల బంగారం, మూడు కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. అమలాపురం డీఎస్పీ ఎల్. అంకయ్య, సీఐ వైఆర్ కే శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా వున్నాయి

మత్తుమందు తాగించేసి... దోపిడీగా చిత్రీకరణ
గన్నవరపు వెంకటరమణమూర్తి అనే ఉపాధ్యాయుడు అమలాపురంలోని కూచిమంచి అగ్రహారం సమీపంలోని గన్నవరపువారివీధిలో నివాసముంటున్నారు. వీరికి ఐదు పోర్షన్ల రెండస్థుల బిల్డింగ్, పెంకుటిల్లుతోపాటు విలువైన ఆస్తులున్నాయి. వెంకటరమణమూర్తి పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఏటిదరి కోడేటిలంకలో జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. భార్య వెంకటపద్మావతి వద్దే అత్తగారు సీతామహాలక్ష్మీ(80) ఉంటున్నారు. వృద్ధురాలైన సీతామహాలక్ష్మికి విలువైన బంగారు, వెండి ఆభరణాలున్నాయి. ఆమె మరణానంతరం లక్షల విలువైన ఆభరణాలు తన ఆడపడుచులు నలుగురికి చెందుతాయనే ఆక్రోశంతో వాటిని కాజేయడానికి సమీప బంధువులతో కలిసి అత్తను హత్యచేయడానికి కోడలు పథక రచన చేసింది.

వెంకటపద్మావతి సోదరుడు ఏడాది క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. అతడి భార్య దేవిరెడ్డి అలియాస్ దివ్య హైదరాబాద్ కు చెందిన చెన్నకేశవరావును రెండో వివాహం చేసుకుని అక్కడే నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అత్త సీతామహాలక్ష్మికి మత్తుమందు ఇచ్చి ఆమె ఆభరణాలు చోరీకి గురైనట్టు కుటుంబసభ్యులను నమ్మించి వాటిని కాజేసేందుకు కోడలు వెంకటపద్మావతి చేసిన పథకాన్ని హైదరాబాద్ లో ఉన్న వదిన దేవిరెడ్డి, ఆమె భర్తకు వివరించి వారిని ఆగస్టు 23న కుటుంబసభ్యులు ఎవరికీ తెలియకుండా రప్పించింది. పట్టణంలోని ఓ హోటల్ లో బస చేసిన ఈ దంపతులు పద్మావతి సూచనమేరకు ఈనెల 24న గోప్యంగా గన్నవరపు వారి వీధిలోని పద్మావతి ఇంటికి చేరుకున్నారు.

అప్పటికే మెడికల్ షాపుల నుంచి కొనుగోలు చేసిన 19 మత్తు బిళ్లలు సీతామహాలక్ష్మి తాగే కాఫీలో కలిపి ఇవ్వడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. మధ్యాహ్నం ఒంటి గంట దాటిన తర్వాత కోడలు వెంకటపద్మావతి, వదిన దేవిరెడ్డి సీతామహాలక్ష్మి ఒంటిపై ఉన్న గాజులు, ఇతర బంగారు ఆభరణాలతోపాటు, ఆమెకు సంబంధించి ఇంటిలోని వివిధ గదుల్లో ఉన్న బీరువాలను బద్దలుకొట్టి సుమారు 25 కాసుల బంగారు ఆభరణాలు, మూడు కిలోల వెండిని అపహరించేసి మూటగట్టి దేవిరెడ్డి, ఆమె భర్త చెన్నకేశవరావు తీసుకుని వెళ్లిపోయారు. ఎలాంటి అనుమానం రాకుండా వెంకటపద్మావతి తన ఒంటిపై ఉన్న ఆభరణాలను కూడా తీసి వారికి ఇచ్చేసింది.

పనిమనిషి వచ్చే సమయానికి ముందు మత్తు బిళ్ల వేసుకుని అపస్మారక స్థితిలో ఉన్నట్టు వీరలెవెల్లో భర్త వచ్చిన తర్వాత మీటర్ రీడింగ్ కు వచ్చిన వ్యక్తి తమపై మత్తుమందు హత్యాయత్నం చేశారంటూ నమ్మబలికే కథనం చెప్పడంతో పద్మావతి భర్త వెంకటరమణమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న తల్లి సీతామహాలక్ష్మిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తుండగా, ఆమె 28న మరణించింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పట్టణ సీఐ వైఆర్ కే శ్రీనివాస్ సెల్ నెంబర్ల ఆధారంగా కేసులోని మిస్టరీని ఛేదించారు. పద్మావతితో పరిచయమున్న ఆటోడ్రైవర్ ను విచారించడంతో ఈ వ్యవహారమంతా బట్టబయలు అయింది.. పద్మావతికి ఆది నుంచి చిన్నచిన్న దొంగతనాలు చేయడం అలవాటు ఉన్నట్టు కూడా పోలీసు విచారణలో తేల్చారు.

క్రైమ్ స్టోరీలే అటు వైపు నడిపించాయట..
కోట్ల రూపాయల ఆస్తులు, భర్తకు ఉద్యోగం ఉన్నప్పటికీ అత్త బంగారు ఆభరణాలు ఆడపడుచులకు దక్కకూడదనే అత్యాశ ఆమెను కటకటాల వెనక్కి నెట్టింది. టీవీల్లో వచ్చే నేర కథనాలపై ఆసక్తి ఉండే తనకు నేరం ఎలా చేయాలనేది తెలుసుకున్నానంటూ పద్మావతి చెప్పడం విశేషం. డీఎస్పీ అంకయ్య, పట్టణ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధాన నింధితురాలైన గన్నవరపు వెంకటపద్మావతి, కందెపు దేవిరెడ్డి అలియాస్ దివ్య, ఆమె భర్త శివచెన్నకేశవరావులను అరెస్ట్ చేసి వారి నుంచి 25 కాసుల బంగారం, మూడు కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. సంచలనం సృష్టించిన ఈకేసు తేలిపోవడంతో సొంత కోడలే ఇలా చేసిందా అంటూ విస్తుపోవడం అందరి వంతు అయింది.

ఇది కూడా చదవండి: ప్రపంచంలో టాప్ 10 అందగత్తెలు వీరే!

ఇది కూడా చదవండి: 'ఇంకొక్కడు' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇది కూడా చదవండి: పాము కాటేస్తే ప్రాణాలు కాపాడుకోవడం ఎలాగో తెలుసా ?

English summary

Daughter in law killed mother in law in Amalapuram