డెల్ టెక్నాలజీస్ లో ఈఎంసీ విలీనం

Dell And EMC Companies Merge Together And Unveil Dell Technologies

11:25 AM ON 1st September, 2016 By Mirchi Vilas

Dell And EMC Companies Merge Together And Unveil Dell Technologies

ప్రపంచంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపార, సాంకేతిక రంగాల్లో పెద్ద కంపెనీలు విలీనం అవుతున్నాయి. తాజాగా ప్రపంచ సాంకేతిక రంగంలో అతి పెద్ద విలీనానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 7న డెల్ టెక్నాలజీస్ లో ఈఎంసీ కార్పొరేషన్ విలీనం అవుతోంది. ఈ ఒప్పందం విలువ దాదాపు 67 బిలియన్ డాలర్లు అంటే రూ.4.50 లక్షల కోట్లు. ఇక ఈరెండు కంపెనీల విషయానికి వస్తే, 1984లో డెల్ ను స్థాపించారు. అమెరికాలోని టెక్సాస్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా సంస్థ కార్యకలాపాలు అందిస్తోంది. కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, సర్వర్లు తయారీ; సాఫ్ట్ వేర్ సేవల విభాగాల్లో సేవలు అందిస్తోంది. కంప్యూటర్ల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా ఉంది.

కాగా 1979లో ఇఎంసి సంస్థను స్థాపించారు. అమెరికాలోని మసాసుసెట్స్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. క్లౌడ్ కంప్యూటింగ్ , వర్చువలైజేషన్ , డేటా నిక్షిప్త పరికరాలు, సమాచార భద్రత వంటి రంగాల్లో సేవలు అందిస్తోంది. జోసెఫ్ ఎం.టుకి ప్రస్తుతం ఛైర్మన్ , సీఈఓగా ఉన్నారు. 70,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థ డేటా నిక్షిప్త సేవల విభాగంలో అగ్రగామిగా ఉంది. 2014లో సంస్థకు 24 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది.

ఇప్పడు ఈ రెండు కంపెనీలు కల్సి కొత్తగా ఏర్పడే సంస్థ తక్షణమే డెల్ టెక్నాలజీస్ పేరుతో కార్యకలాపాలు కొనసాగిస్తుంది. ఈ ప్రతిపాదనకు చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ అనుమతులు జారీ చేసింది. ఈ విలీనానికి గత జులైలో ఈఎంసీ వాటాదార్లు అంగీకారం తెలిపారు. ఒప్పందం ప్రకారం ఈఎంసీ వాటాదార్లు ఒక్కో షేరుకు దాదాపు రూ.1600 (24.05 డాలర్లు) నగదు రూపంలో అందుకోనున్నారు.

ఈఎంసీ కార్పొరేషన్ విలీనం వల్ల డెల్ టెక్నాలజీస్ కు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయని అంటున్నారు. డిజిటల్ సాంకేతికత; వర్చువల్ డేటా కేంద్రాలు; సర్వర్లు, డేటా నిక్షిప్త సాధనాలు, నెట్ వర్క్ పరికరాలు, ఆటోమేషన్ , సాఫ్ట్ వేర్ వంటి సేవలు ఒకే గొడుగు కింద అందించడం; హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ ; మొబైల్ సెక్యూరిటీ వంటి మరిన్ని సేవలు అందించే సామర్థ్యం డెల్ కు చేకూరుతుంది. డెల్ , ఈఎంసీ కార్పొరేషన్ ల విలీనం ఒక చారిత్రాత్మక సంఘటనగా డెల్ టెక్నాలజీస్ ఛైర్మన్ , ముఖ్యకార్య నిర్వహణాధికారి (సీఈఓ) మైఖేల్ డెల్ అభివర్ణించారు. ఈఎంసీ కార్పొరేషన్ తమ సంస్థలో విలీనం కానున్నట్లు గత ఏడాది అక్టోబరులోనే డెల్ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:కొనసాగుతున్న మారుతీ హవా

ఇవి కూడా చదవండి:ఇన్నోవేటివ్ ఐడియాలకు రివార్డులు

English summary

Worlds Top Personal Computer and Laptop Manufacturer and Software company Dell announced that they were going to merge EMC company and announced their future brand named "Dell Technologies". The deal worth was 4.50 lakh crores.