చనిపోయిన గురువుని మమ్మీగా మార్చి పూజలు చేస్తున్న శిష్యులు!

Disciples worshipping teacher mummy in China

11:15 AM ON 3rd May, 2016 By Mirchi Vilas

Disciples worshipping teacher mummy in China

లోకంలో భక్తులు అనేక రకాలు. ఎలా అంటే చెక్కిన రాతి శిల్పాన్ని దేవుడిగా కొలుస్తారు కొందరు. బతికున్న 'బాబా' లను మనిషి రూపంలో ఉన్న దేవుడని కొలుస్తారు ఇంకొందరు. నిష్క్రమించిన మహా పురుషుల సమాధుల చుట్టూ ఆలయాలు నిర్మించి పూజిస్తారు మరికొందరు. కానీ, శవాన్ని మమ్మీగా చేసి పూజించడం ఎప్పుడైనా విన్నారా? జాతిపిత అంతటి మావో జెడాంగ్ భారీ విగ్రహాన్ని నేలమట్టం చేసి, వ్యక్తి ఆరాధనను వ్యతిరేకిస్తామని గొప్పగా ప్రకటించుకున్న జన చైనాలోనే ఈ వింత దృశ్యం చోటు చేసుకుంది! వివరాల్లోకి వెళితే ఫూ హోయ్ తన 13వ ఏట బౌద్ధ భిక్షువుగా మారారు. ధర్మ సూత్రాలను నలుగురికీ బోధిస్తూ, అనతికాలంలోనే గొప్ప గురువుగా పేరు పొందారు.

తన 94 ఏళ్ల జీవితమంతా క్వాంజువా(దక్షిణ చైనా)లోని చాంగ్ ఫూ టెంపుల్ లోనే గడిపారు. నాలుగేళ్ల కిందట(2012లో) ఆయన పరమపదించారు. ఫూ మోయ్ మరణం ఆయన శిష్యులను తీవ్రంగా కలిచివేసింది... గురువు గారు లేని చాగ్ ఫూ ఆలయాన్ని వాళ్లు ఊహించుకోలేకపోయారు. తీవ్ర తర్జనభర్జనల అనంతరం ఒక నిర్ణయానికి వచ్చారు. చనిపోయిన ఫూ హోయ్ మృతదేహానికి ప్రాచీన పద్ధతిలో రకరకాల రసాయనాలు పూసి, పెద్ద జాడీలో భద్రపరిచారు. దాన్నొక రహస్యప్రదేశంలో దాచి, ఇటీవలే బయటకి తీశారు. బతికున్నప్పుడు ఆయన ఎలాగైతే కూర్చునేవారో అదే ఆకారంలో ఉన్న మమ్మీకి బంగారం పోతపోశారు.

గురువుగారి మనసులాంటి స్వచ్ఛమైన బంగారం పోతతో ధగధగా మెరిసిపోతోన్న ఆ మమ్మీ విగ్రహం వద్ద పూజలు గట్రా నిర్వహించడంతో పాటు ధ్యానం కూడా చేస్తున్నారు శిష్యులు! కొందరు దీనిని గురువుగారికి లభించిన 'సముచిత గౌరవం' అంటున్నారు. మరి మీరేమంటారు?

English summary

Disciples worshipping teacher mummy in China. China disciples worshipping teacher mummy.