ఐడీబీఐ బ్యాంకు అధికార్లకు,కింగ్‌ఫిషర్‌లకు సమన్లు

ED summons to IDBI Officials and Kingfisher CFO

10:58 AM ON 11th March, 2016 By Mirchi Vilas

ED summons to IDBI Officials and Kingfisher CFO

సీబీఐ జారీ చేసిన ‘లుక్‌ అవుట్‌’ నోటీసులను తప్పించుకుని మరీ బ్రిటన్‌కు వెళ్లిన విజయ్ మాల్యాను తిరిగి రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతుండగా, మరోపక్క కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ రుణాల ఎగవేత కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మొదటి అడుగు పడిందని చెప్పాలి. ఐడీబీఐ బ్యాంకు, కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన అధికార్లకు సమన్లు జారీ చేసింది. ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ.900 కోట్ల రుణ ఎగవేత క్రమంగా మనీ లాండరింగ్‌ కిందకు మారడంతో దీని పై ఈడీ దర్యాప్తు చేపడుతోంది. అందులో భాగంగానే బ్యాంకు మాజీ సీఎండీ యోగేశ్‌ అగర్వాల్‌, కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ సీఎఫ్‌ఓ ఎ.రఘునాథన్‌తో పాటు ఇరు సంస్థలకు చెందిన మరికొంత మంది సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు, అధికార్లకు సమన్లు పంపింది. ఈ సమన్లను ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌(పీఎల్‌ఎమ్‌ఏ) నిబంధనల కిందే జారీ చేసారు. సమన్లు అందుకున్న వారందరూ గత అయిదేళ్ల వ్యవధికి చెందిన వ్యక్తిగత ఆర్థిక వివరాలు, ఆదాయ పన్ను రిటర్న్‌ల(ఐటీఆర్‌)ను సమర్పించాల్సి ఉంటుంది. అంతే కాక వారు ఈడీ ముందు హాజరై వారి వాంగ్మూలాలను తెలియపరచాల్సి ఉంటుంది. గతేడాది సీబీఐ నమోదు చేసిన తొలి సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) ఆధారంగా ఈడీ ఇటీవల మాల్యా, ఇతరులపై మనీ లాండరింగ్‌ కేసును నమోదు చేసింది. అంతే కాక, ఇంకా ఏమైనా అవకతవకలు జరిగాయేమోనన్న అనుమానాల మధ్య కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ మొత్తం ఆర్థిక నిర్మాణంపైనా ఈడీ దర్యాప్తు చేపడుతోంది. కాగా, కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ నుంచి ఏప్రిల్‌ 2013 నుంచి ఇప్పటి దాకా బ్యాంకులు రూ.1244 కోట్ల బకాయిలను వసూలు చేసుకున్నాయని మాల్య గతంలో చెప్పారు.

బ్రిటన్ లోని పల్లెలో మాల్యా ...

బ్రిటన్‌కు వెళ్లి తన పిల్లలతో గడపాలనుకుంటున్నట్లు గత నెలలోనే ప్రకటించిన మాల్యా తాను తప్పించుకుని పారిపోవాలనుకోవడం లేదని చెప్పారు. అయితే ఇంతలోనే చడీచప్పుడూ లేకుండా భారత్‌ వదిలి పెట్టారు. కాలిఫోర్నియాలో ఖరీదైన, విలాసవంతమైన ఆస్తులను కలిగి ఉన్న మాల్యాకు.. టెవిన్‌ గ్రామంలోనూ పెద్ద భవంతి ఉంది. 30 ఎకరాల్లో ఉండే ఆ ఎస్టేట్‌ చుట్టూ బలమైన ఇనుప గేట్లు ఉంటాయి. సాధారణంగా అక్కడకు వెళ్లినపుడల్లా పబ్‌లలో తరచుగా గడిపే మాల్యా ఈ సారి ఎస్టేట్‌ దాటి బయటకు రాలేదట.

పార్లమెంటరీ దర్యాప్తు చేయమంటున్న బ్యాంకు ఉద్యోగ సంఘం

కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ ఇతర గ్రూప్‌ కంపెనీలకు జరిగిన రుణ మంజూరు విషయంలో ఒక పార్లమెంటరీ దర్యాప్తు జరగాలని బ్యాంకు ఉద్యోగుల సంఘం ఒకటి కోరుతోంది. ‘ఈ మొత్తం వ్యవహారం రోత పుట్టించేదిలా ఉంది. అందుకే పూర్తి స్థాయి పార్లమెంటరీ దర్యాప్తు అవసరం. బ్యాంకులు రుణాలను ఎలా ఇస్తాయి. అందులో రిజర్వ్‌ బ్యాంక్‌ పాత్ర ఏమిటి. ఎందుకు మొండి బకాయిల రికవరీకి ఎప్పటికప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రజలకు తెలియాల్సిన అవసరం వుంది’అని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) జనరల్‌ సెక్రటరీ సీహెచ్‌ వెంకటాచలమ్‌ వ్యాఖ్యానించారు.

పారిపోలేదంటున్న విజయ్‌మాల్యా

కాగా బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన కేసులో నిందితుడిగా ఉన్న విజయ్‌మాల్యా గుట్టు చప్పుడు కాకుండా దేశం విడిచి వెళ్ళడంతో మాల్యాపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం, రాజ్యసభలో కూడా ఈ అంశంపై చర్చ జరగడం అయ్యాయి. ఎట్టకేలకు విజయ్‌మాల్యా శుక్రవారం ఉదయం ట్విట్టర్‌లో స్పందిస్తూ, తాను ఎక్కడికీ పారిపోలేదని, వ్యాపార నిమిత్తం తరచు విదేశాలకు వెళుతుంటానని చెబుతున్నారు. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశానని, భారతీయ చట్టాలపై తనకు గౌరవం, నమ్మకం ఉందని అంటున్నారు. విజయ్‌మాల్యా వివిధ బ్యాంకులకు దాదాపు రూ.9వేల కోట్లు చెల్లించాల్సి ఉంది.

English summary

Enforcement Directorate(ED) sends summons to IDBI Officials and Kingfisher CFO A.Raghunathan and few other officials.Vijaya Malya have to pay 95 thousand crore rupees to banks.Vijay Mallya says that he was not Fleeing from India.