సైకిల్ దిగేసి,  కారు ఎక్కేసిన ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao Joined In TRS

10:39 AM ON 11th February, 2016 By Mirchi Vilas

Errabelli Dayakar Rao Joined In TRS

తెలంగాణా టిడిపిలో మరో వికెట్ పడిపోయింది. గ్రేటర్ ఎన్నికల ఫలితాల నేపధ్యంలో టిడిపి జీరోకి వెళ్ళడంతో పార్టీ సీనియర్‌ నేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మరో నేత ప్రకాశ్‌గౌడ్‌ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి హరీష్ రావు కారులో ఎర్రబెల్లి నేరుగా కెసిఆర్ దగ్గరకు వెళ్లి పార్టీ గూటిలో చేరిపోయారు. నిన్న మొన్నటివరకు దారుణంగా టిఆర్ఎస్ పై దుమ్మెత్తి పోసిన ఎర్రబెల్లి ఇప్పుడు టిఆర్ఎస్ లో చేరిన సందర్భంగా స్టైల్ మార్చారు. పార్టీ నిర్ణయం మేరకే గతంలో కేసీఆర్‌ను, తెరాస నాయకులను విమర్శించాల్సి వచ్చిందని ఆయన వివరణ కూడా ఇచ్చేసారు. అదే సమయంలో చంద్రబాబు పై ప్రభు భక్తి చాటుకుంటూ, చంద్రబాబుపై తనకు ఎలాంటి వ్యతిరేకతలేదని, తెలుగుదేశం పార్టీని వీడటం బాధాకరమని అనేసారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. కార్యకర్తలంతా క్షమించాలని కూడా కోరేసారు. ప్రజలంతా టిఆర్ఎస్ వైపే ఉన్నారని.. తెలంగాణలో టిడిపి బతికి బట్టకట్టే పరిస్థితి లేదన్నారు. వరంగల్‌లో గానీ నిజాం కళాశాల మైదానంలో గానీ ఓ సభ నిర్వహించనున్నట్లు కూడా చెప్పిన ఎర్రబెల్లి మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా గులాబి దళంలో చేరే అవకాశం ఉందంటూ సంకేతాలు ఇచ్చారు.

ఇక నియోజక వర్గ అభివృద్ధి కోసమే టిఆర్ఎస్ లో చేరినట్లు మరో నేత ప్రకాశ్‌గౌడ్‌ వెల్లడించారు. మరింతమంది నేతలు టిఆర్ఎస్ గూటికి వస్తారని కూడా ఆయన అన్నారు. ఇక ఇలాగైతే తెలంగాణాలో టిడిపి ఖాళీ అయిపోయినట్లే నా ... ఒకరు పొతే వందమంది నేతలను తయ్యారు చేస్తామన్న మాటలు టిడిపి ఇప్పుడు చెప్పగలదా ? ఇవి తెలంగాణాలో వినిపిస్తున్న ప్రశ్నలు .

కాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకుపాల్పడినందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి ఎర్రబెల్లి, వివేకానంద్‌ గౌడ్‌, ప్రకాశ్‌గౌడ్‌లను సస్పెన్షన్‌ చేస్తున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

English summary