ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కెన్నాళ్ళకు.....

Ex- CM KiranKumar Reddy Talks To Media After A Long Time

01:33 PM ON 29th December, 2015 By Mirchi Vilas

Ex- CM KiranKumar Reddy Talks To Media After A Long Time

రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించి , చివరివరకు పోరాటం సల్పిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి సిఎమ్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చాలా కాలానికి మళ్ళీ నోరు విప్పారు. తెలుగు రాజకీయాల్లో ఎవరూ ఊహించని విధంగా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ నాయకుడు. రాష్ర్ట విభజన నేపథ్యంలో ముఖ్యమంత్రి అయిన నల్లారి వారు అదే విభజన అంశంతో తెరవెనక్కు పోయారు.జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి , ఊహించని దెబ్బతిని , కనుమరుగు అయిపోయారు.

ఆమధ్య బిజెపి నేత కిషన్ రెడ్డి తదితరులను కలవడంతో బిజెపిలోకి వెళ్ళిపోతున్నారని వార్తలు పొక్కాయి. చివరకు తెలుగు రాష్ర్టాలను వదిలిపెట్టి బెంగళూరులో ష్టిరపడిన కిరణ్ కుమార్ రెడ్డి మీడియాకు కూడా దూరంగానే వున్నారు. దీంతో ఆయన్ని ప్రజలు కూడా మర్చిపోయారు. అప్పుడప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు తలెత్తి నప్పుడు మాత్రం ఆనాడు కిరణ్ చెప్పిందే జరుగుతోందని పలువురు ప్రస్తావించడం కూడా జరుగుతోంది.

ఎప్పుడో ఒకసారి...అది కూడా బాగా దగ్గరైన వ్యక్తులకు చెందిన శుభకార్యాలకు తప్ప మరి దేనికి కిరణ్ హాజరుకావడం లేదు.

అయితే క్రియాశీలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నట్లున్నారే తప్పితే... మానసికంగా పరిణామాలన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తు న్నారని తాజాగా తేటతెల్లమైంది. వివరాల్లోకి వెళితే, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కు చెందిన రాజీవ్ గాంధీ విద్యాసంస్థల సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనడానికి రాజమండ్రి వెళ్లారు. తనను కలిసిన మాజీ ఎమ్మెల్యేలు - నాయకులతో ఈ మాజీ ముఖ్యమంత్రి కాసేపు ముచ్చటించారు. ఏ పార్టీలోనూ చేరకుండా తటస్థంగా ఉండిపోయిన పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ కిరణ్ కుమార్ రెడ్డితో సహా తనలాంటి వారి భవిష్యత్ కార్యాచరణను లేవనెత్తారు. దీనిపై కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ ‘వేచి చూద్దాం. అప్పుడే తొందర లేదు’ అంటూ సముదాయించారు.

ఈ సందర్భంగా తనను కలిసిన మాజీ ఎమ్మెల్యేలు - నాయకులతో కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రప్రభుత్వం పని తీరు ఇరిగేషన్ ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించారు. కృష్ణా బ్యారేజి బేసిన్ లో 3టీఎంసీల నీటిని నిల్వచేయవచ్చని కానీ బేసిన్ లో 1టీఎంసీ నీటి నిల్వకు సరిపడా ప్రాంతం ఇసుక మేటలతో నిండి ఉందని, మరో 1.5 టీఎంసీ నీటిని వీటీపీఎస్ కు సరఫరాచేయాల్సి ఉంటుందని ఇక మిగిలిందల్లా 0.5టిఎంసీ మాత్రమేనన్నారు. ఈ మాత్రం దానికి అంత డబ్బు ఖర్చుచేసి పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించాల్సిన అవసరం లేదని మాజీ ఎమ్మెల్యేలకు కూడా కిరణ్ వివరించినట్టుచెబుతున్నారు.

మీడియాతో కూడా మాట కలిపారు. మీడియా వలన నీటి సమస్య ఏర్పడుతుందని ఆనాడే చెప్పానని , ఇప్పుడు అదే జరుగుతోందని ఆయన గుర్తు చేసారు. 'విభజన తర్వాత నేను మీడియాతో మాట్లాడలేదు. నీటి పంపిణీ సమస్య తీవ్రతరం కానుంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టుకి వెళ్లాం. కృష్ణా నదిలో ఆఖరి రాష్ట్రం ఎపి. వరదలు , కరువు ఇక్కడే ఎక్కువ. తీవ్రంగా దెబ్బతింటున్నాం. వాస్తవానికి 75 శాతం మిగులు జలాలను ఉపయోగించుకోవచ్చు' అని ఆయన వివరించారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం సరికాదని దీనివల్ల కృష్ణా డెల్టాకు ఏమంత ప్రయోజనం ఉండదని చెప్పారు. అమరావతి లో జరిగే విషయాలన్నీ ప్రజలకు తెలియజేయాలని ఆయన స్పష్టం చేసారు. తాను సిఎమ్ గా వుండగా ఆరు లక్షల ఇళ్ళు తెచ్చామని , అప్పుడు ఏ దశలో వున్నాయో ఇప్పుడూ అదే ష్టితిలో వున్నాయని ఆయన విచారం వ్యక్తం చేసారు.

English summary

Ex- CM KiranKumar Reddy Talks To Media After A Long Time. He talks about the new state andhra pradesh current problems including water and etc.