ఫేస్‌బుక్ లైక్‌తో జర భద్రం..

Facebook Like is Being Used By Scammers

12:23 PM ON 7th March, 2016 By Mirchi Vilas

Facebook Like is Being Used By Scammers

ఫేస్‌బుక్‌.. ఇప్పుడు యువత ఎక్కువగా వినియోగిస్తున్న సామాజిక వెబ్ సైట్. తమకు నచ్చిన పోస్ట్ ను ఈజీగా లైక్.. షేర్ చేస్తూ.. ఫ్రెండ్స్ పై కామెంట్లు చేస్తూ గడిపేస్తున్నారు. అయితే ఇకపై ఏదైనా పోస్ట్ ను లైక్ లేదా షేర్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఫేస్‌బుక్ లైక్‌లపైన కన్నేశారు. దీని ద్వారా మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. లండన్‌కు చెందిన ఐటీ రీసెర్చ్ టీమ్ ఈ విషయాన్ని వెల్లడించింది. సైబర్ నేరగాళ్లు, స్కామర్లు యూజర్లను ఆకుట్టుకునేలా ఉండే ఏదైనా విషయాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తారు. దానికి ఎక్కువ లైక్‌లు, కామెంట్లు, షేర్లు వస్తాయి. అనంతరం వీలు చూసుకుని వారు ఆ పోస్ట్‌లో హానికరమైన మాల్‌వేర్‌ను జొప్పిస్తారు. ఎక్కువ మంది యూజర్లు లైక్ చేసి ఉండడంతో వారి ఫేస్‌బుక్ ప్రొఫైల్స్ నుంచి సమాచారమంతా హ్యాకర్లకు చేరుతుంది. ఇదే కాకుండా కొంతమంది సైబర్ నేరగాళ్లు ఆయా ఉత్పత్తులను కొనమంటూ నకిలీ ఫేస్‌బుక్ పేజీలను కూడా తెరుస్తున్నారని సదరు పరిశోధన బృందం తెలియజేసింది. ఫేస్‌బుక్‌లోని సంబంధిత నకిలీ పేజీలో ఏదైనా లింక్‌ను యూజర్లు ఓపెన్ చేస్తే అన్ని ఈ-కామర్స్ సైట్ల మాదిరిగానే ఉత్పత్తిని కొనుగోలు చేయాలంటూ పేమెంట్ వివరాలను తెలియజేయాలని ఆ పేజీ సూచిస్తుంది. అందులో యూజర్లు తమ వివరాలను ఎంటర్ చేస్తే ఇక అంతే సంగతలు. నగదు ఎప్పుడు, ఏ రూపంలో మాయమవుతుందో ఇక లెక్కలు వేసుకుంటూ చూడాల్సిందే. ఈ నేపథ్యంలోనే ఫేస్‌బుక్ యూజర్లు తాము ఏదైనా పోస్ట్‌ను లైక్ చేసేముందు, ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా జాగ్రత్తలు వహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

English summary

Scam artists are using users' "Like" on social networking website Facebook to make them vulnerable to online scams