2వేలకోట్ల నష్టాలలో ఫ్లిప్‌కార్ట్‌

Flipkart on big looses

12:49 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

Flipkart on big looses

అవును మీరు విన్నది నిజమే...ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజం 2వేల కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. దేశంలో రోజుకు పెరిగిపోతున్న ఆన్‌లైన్‌ షాపింగ్‌ క్రేజ్‌ అంతా ఇంతాకాదు. ఈ రంగంలో రాకెట్‌ వేగంతో దూసుకుపోతున్న ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌, అమెజాన్‌ వంటి సంస్థలు ప్రజలను ఆకట్టుకునేందుకు పండగ సేల్స్‌తో, భారీ డిస్కౌంట్లతో మార్కెట్‌ను ఊదరగొట్టడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే డిస్కౌంట్‌ల మోత ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ నష్టాల భారాన్ని తెచ్చిపెట్టింది. ఆన్‌లైన్‌ షాపింగ్‌ రంగంలో పోటీ తారాస్థాయికి చేరింది. ఎవరు ఎక్కువ శాతం డిస్కౌంట్లను అందిస్తారో వారే ఈ రంగంలో ఎక్కువ మంది ఖాతాదారుల అభిమానాన్ని చూరగొనే అవకాశం ఉండడంతో..సదరు వెబ్‌సైట్‌లు ఇబ్బడిముబ్బడిగా డిస్కౌంట్లు ప్రకటిస్తూ లక్షల కొలదీ సరుకును నిముషాలల్లోనే ఆన్‌లైన్‌లో అమ్మేస్తున్నాయి. ఈ రంగంలో పోటీ ప్రముఖంగా స్నాప్‌డీల్‌, ఫ్లిప్‌కార్ట్‌ల మధ్య ఉండడంతో ఈ రెండు సంస్థలు తీవ్రస్థాయిలో డిస్కౌంట్లను ప్రకటిస్తూ తమ వ్యాపారాన్ని సాగిస్తున్నాయి. ఈ పోటీ వాతావరణం ఇప్పుడు అసలుకే ఎసరు తెచ్చే పరిస్థితి దాపురించింది.

ఫ్లిప్‌కార్ట్‌కు ఈ డిస్కౌంట్ల భారం మూలాన 2వేల కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌ ఇంటర్‌నెట్‌ సంస్థ గత ఏడాది 1000కోట్ల నష్టాన్ని నమోదు చేయగా, ఫ్లిప్‌కార్ట్‌ ఇండియా సంస్థ 835కోట్లకు పైగా నష్టాన్ని నమోదుచేసింది. రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు ఈ వివరాలను ఫ్లిప్‌కార్ట్‌ అందజేసింది. అత్యంత రిస్క్‌తో కూడుకున్న ఈ ఆన్‌లైన్‌ మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ లాంటి సంస్థలు మరింత మంది ఖాతాదారులను ఆకట్టుకునేందుకు డిస్కౌంట్లతో మరింత నష్టాలను చూడాల్సి వస్తుందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఫ్లిప్‌కార్ట్‌ మాత్రం వచ్చే ఏడాది 10బిలియన్‌ డాలర్ల (సుమారు 65000కోట్ల రూపాయలు) సరుకులను అమ్మేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది. నష్టశాతాన్ని తగ్గించుకుంటూనే ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషించే పనిలో ఉందిట ఫ్లిప్‌కార్ట్‌.

English summary

Online shopping company Flipkart had got a loss of about Rs 2,000 crore in the year ended March 2015 by giving huge discounts and deals