ఫ్రెండ్ రిక్వెస్ట్ కోసం టీమ్ నిరాహార దీక్ష!

Friend request movie team doing hunger strike

11:26 AM ON 12th July, 2016 By Mirchi Vilas

Friend request movie team doing hunger strike

మోడరన్ సినిమా పతాకంపై హీరో ఆదిత్య ఓం స్వీయ దర్శకత్వంలో సోషల్ మీడియా బ్యాక్ డ్రాప్ లో నిర్మించిన యూత్ ఫుల్ హారర్ ఎంటర్టైనర్ 'ఫ్రెండ్ రిక్వెస్ట్'కి విడుదల విషయంలో జరిగిన అన్యాయానికి నిరసన తెలియజేస్తూ టీమ్ చేసిన నిరాహార దీక్షకు మాంచి స్పందన లభించింది. చిత్ర యూనిట్ కి పలువురు ప్రముఖులు సంఘీభావాన్ని తెలుపుతున్నారు. దీక్ష ప్రారంభించిన తొలి రెండు రోజుల్లో పెద్దగా స్పందన లేకున్నా, మూడవ రోజైన ఆదివారం చిన్న చిత్రాల నిర్మాతలు, దర్శకులు, షార్ట్ ఫిల్మ్ మేకర్స్, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు.. ఇలా దాదాపు 200 మంది ఫిల్మ్ ఛాంబర్ ప్రాంగణంలోని దీక్షా శిబిరానికి క్యూ కట్టారు.

చిన్న చిత్రాల విడుదల విషయంలో ప్రతి నిర్మాతా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని, థియేటర్ల విషయంలో మాఫియాలా వ్యవహరిస్తున్న కొంతమంది పెద్దలు తమ ధోరణిని మానుకోవాలని, ఇలాంటి దుస్థితి మరో నిర్మాతకు రాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేలా ఫిల్మ్ ఛాంబర్ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆందోళన కారులు డిమాండ్ చేశారు. కోట్లు ఖర్చు పెట్టి సినిమాయే తమ ప్రాణంగా కష్టపడి ఒక మంచి సినిమా తీస్తే దాన్ని ప్రేక్షకుల వరకు చేర్చే అవకాశం లేకుండా చేస్తున్న ఈ సిస్టమ్ పూర్తిగా మారాలి. ప్రేక్షకుల వరకు సినిమా వెళ్ళనప్పుడు ఆ సినిమా ఫలితం ఏమిటి అనేది ఎలా తెలుస్తుంది అంటూ దర్శకుడు ఆదిత్య ఓం తన ఆవేదన వ్యక్తం చేశాడు.

శుక్రవారం రిలీజ్ అవ్వాల్సిన మా సినిమాకి థియేటర్లు లేవని గురువారం రాత్రి తెల్సింది. ఆ సమయంలో ఈ విషయాన్ని ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్ళే అవకాశం లేదు. ఒక వేళ తీసుకెళ్ళినా తమకు ఎలాంటి న్యాయం జరగదు. అందుకే నిరాహార దీక్ష ఒక్కటే మార్గమని ఈ నిర్ణయం తీసుకున్నాం. రిలీజ్ రోజు సిటీలో కేవలం ఒకే ఒక్క థియేటర్ లో, అదీ రెండు షోలు మాత్రమే ఇచ్చారని తెలిసిన తర్వాత మా సినిమా కిల్ అయిపోయిందని అప్పుడే డిసైడ్ అయిపోయాం. ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఏ నిర్మాతకీ రాకూడదని ఈ పోరాటాన్ని చేస్తున్నాం అంటూ నిర్మాత విజయ్ వర్మ చెప్పుకొచ్చారు.

కొంతమంది సినీ ప్రముఖుల జోక్యంతో సిటీలో నాలుగు థియేటర్లు మాత్రమే దొరికాయనీ, అది కూడా ఒక్కో థియేటర్ లో మార్నింగ్ షో మాత్రమే ఇచ్చారని, దానివల్ల సినిమాకి ఎలాంటి ఉపయోగం జరగదని విజయ్ వర్మ ఆవేదనను వ్యక్తం చేశారు. మూడు రోజులుగా తాము చేస్తున్న దీక్షకు అందరి మద్దతు లభించిందని, తమను సపోర్ట్ చేస్తున్న వారందరికీ ఈ సందర్భంగా దర్శకుడు ఆదిత్య ఓం, నిర్మాత విజయ్ వర్మ, యూనిట్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

English summary

Friend request movie team doing hunger strike