నేడో రేపో గ్రేటర్ సైరన్

GHMC Elections Notification To Release Soon

04:51 PM ON 2nd January, 2016 By Mirchi Vilas

GHMC Elections Notification To Release Soon

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల సందడి మొదలు కానుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్‌ జనవరి 23గా విస్తృత ఊహాగానాలు చెలరేగాయి. ఓట్ల తొలగింపు వివాదం గురించి కోర్టు కు వెళ్ళడం వంటి పరిణామాల నేపధ్యంలో సంక్రాంతి అంతా ఎన్నికల ప్రచారంతో హోరెత్త నుంది. రేపో మాపో ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతోందన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. మరోపక్క తెలంగాణ కేబినెట్ సుదీర్ఘ భేటీ కూడా ఇందుకు బలం చేకూర్చింది. షెడ్యూల్ లోగానే వరాల జల్లు కురిపించే నిర్ణయాలు వస్తాయని అంటున్నారు.

ఆదివారం సాయంత్రం జీహెచ్ఎంసీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడుతుందని అందరూ భావిస్తున్న క్రమంలోనే శనివారం రాత్రి గానీ ఆదివారం ఉదయం గానీ జీహెచ్‌ఎంసీ వార్డుల రిజర్వేషన్లు ఖరారు అవుతాయని అంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందనే సమాచారంతో అన్ని పక్షాల నేతలు ఎన్నికలకు సమాయత్తమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రచారానికి సిద్ధమైంది. నోటిఫికేషన్ రాకపోయినా ప్రచార కార్యక్రమాలను ఖరారు చేసుకుంది. ఆదివారం నుంచి గ్రేటర్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టబోతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.

గ్రేటర్ పరిధిలో 150 డివిజన్లలో 84 హైదరాబాద్ సిటీ పరిధిలో ఉండగా, 64 రంగారెడ్డి పరిధిలో, 2 మెదక్ జిల్లా పరిధిలో ఉన్నాయి. మరోవైపు ఎన్నికల ప్రణాళికను ఖరారు చేసుకు న్న నాయకులు ఆదివారం గాంధీభవన్‌లో 150 డివిజన్లకు కాంగ్రెస్ నియమించిన ఎన్నికల పార్టీ పరిశీలకులు, డివిజన్ కమిటీలతో సమావేశమవుతున్నారు. ఈ నెల 5న ఉదయం 11 గంటలకు గ్రేటర్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాల్లో డివిజన్ కమిటీలు, బూత్ కమిటీల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 7నుంచి అన్ని డివిజన్లలో ఇంటింటి ప్రచారం చేపట్టాలని తెలంగాణ పీసీసీ నిర్ణయించింది. టిడిపి కూడా శనివారం సమావేశమై పలు అంశాలు చర్చించింది. ఇక గులాబి దళం ముందస్తు ప్రణాళికతో దూసుకు పోతోంది.

గ్రేటర్ ఎన్నికల్లో జనసేన రంగంలో ఉంటుందన్న సంకేతాలు కూడా రావడంతో గ్రేటర్ ఎన్నికలు మంచి రంజుగా సాగనున్నాయి. గ్రేటర్ లో సెటిలర్లే కీలక భూమిక అవుతుంది. అందుకే వారిని ఆకట్టుకునే విధంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి.

English summary

Greater Hyderabad Municipal Corporation (GHMC) Elections Notification to be released soon.THere were almost 150 wards in Greater Hyderabad Municipal Corporation Zone