ఎట్టెట్టా ...  గ్రేటర్ లో ఎవరి వాటా ఎంత ...

GHMC Elections Seat adjustments

12:48 PM ON 5th January, 2016 By Mirchi Vilas

GHMC Elections Seat adjustments

త్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జిహెచ్ఎంసి) ఎన్నికలకు సంబంధించి రేపో.. మాపో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజకీయాలు ఊపందుకున్నాయి. అందరికంటే ముందుగా టిఆర్ఎస్ విస్తృతంగా మీటింగ్స్ పెట్టుకుని వెళ్లిపోతుంటే, కాంగ్రెస్ కూడా గ్రేటర్ మేనిఫెస్టో కోసం కసరత్తు చేస్తుంటే , తెలుగు తమ్ముళ్ళు ఈనెల 7న బహిరంగ సభకోసం ఏర్పాట్లు చేస్తున్నారట. ఇక బిజెపి కూడా అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాల్సిన తెలుగుదేశం.. బీజేపీల మధ్య సీట్లసర్దుబాటు వ్యవహారం కూడా తెరవెనుక నలుగుతోంది. ఎవరెవరు ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేయాలన్నది ఇప్పుడు రెండు పార్టీల్లో జోరుగా చర్చగా సాగుతోంది.

పాత లెక్కలు , కొత్త లెక్కలతో ఇరుపార్టీలు సీట్ల బేరంలో కూర్చోనున్నారు. 2009లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ 5 స్థానాల్లో విజయం సాధిస్తే.. టీడీపీ 45 డివిజన్లలో విజయకేతనం ఎగురవేసింది. ఈలెక్కన ఈ నేపథ్యంలో మొత్తం 150 డివిజన్లు ఉన్న గ్రేటర్ లో ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న విషయంపై రెండు పార్టీల మధ్య చర్చలు సూత్రప్రాయంగా మొదలయ్యాయని అంటున్నారు. కానీ ఇక్కడ అసలు విషయానికి వస్తే , 2009 ఎన్నికల్లో ఎవరికి వారు విడివిడిగా బరిలో వున్నారు.

టీడీపీ.. బీజేపీ అప్పుడు ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టు వుంటే , ఇప్పుడు అందుకు భిన్నంగా రెండు పార్టీలు జతకల్సి , బరిలోకి దిగనున్నాయి. 2009తో పోలిస్తే, ఇప్పుడు బీజేపీ బలపడిందని.. ప్రధాని మోడీ నేతృత్వంలో పార్టీ శక్తివంతమైన నేపథ్యంలో తాము ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ సహజంగానే బావిస్తోంది. దీనికి తోడు గ్రేటర్ లో ఇప్పటికే చాలామంది బలమైన టిడిపి నేతలు టిఆర్ఎస్ లోకి జంప్ అయ్యారని ఇలాంటి పరిస్థితుల్లో , తమ పార్టీకి ఎక్కువ సీట్లు ఇస్తే , అధికార టిఆర్ఎస్ ని ఎదుర్కోవడం సాధ్యపడుతుందని ఆపార్టీ శ్రేణులు అంటున్నారు.

ఇక తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే , ఆపార్టీ ఆలోచన మరోలా ఉంది. గ్రేటర్ పరిధిలో తమకు బలం ఉన్నందున, తామే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. తాజా లెక్కల ప్రకారం తాము 95 స్థానాల్లో పోటీ చేయాలని , మిగిలిన 55 స్థానాల్ని మిత్రుడికి కేటాయించాలని టిడిపి చెబుతోంది. ఇక.. ఎవరెవరు ఏయే స్థానాల్లో పోటీ చేయాలన్నది ఇరుపార్టీ నేతలే కూర్చుని డిసైడ్ చేస్తారని కార్యకర్తలు అంటున్నారు. మరి టిడిపి అంచనా ప్రకారం ఇలాగే సీట్లు ఉంటాయా , చివరి క్షణంలో టిడిపి కొంత మెత్తబడి బిజెపి కోరినన్ని సీట్లు వదిలేస్తుందా అన్నది చూడాలి. టిడిపి సభ తర్వాత రెండు పార్తీలమధ్య సీట్ల సర్బుబాటు వ్యవహారం నడుస్తుంది. అంతవరకూ ఇంకా ఎన్నెన్ని వాదనలు , ఊహాగానాలు వస్తాయో మరి.

English summary

Greater Hyderabad Municipal Corporation(GHMC) Elections Seat adjustments between TDP and BJP