జికాపై గ్లోబల్ ఎమర్జెన్సీ

Global Emergency Over Zika Virus

10:45 AM ON 2nd February, 2016 By Mirchi Vilas

Global Emergency Over Zika Virus

ప్రస్తుతం దక్షిణ అమెరికా దేశాల్లో భయోత్పాతం సృష్టిస్తున్న జికా వైరస్ వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ వైద్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఈ అంశంపై చర్చించేందుకు డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల సమావేశం సోమవారం జెనీవాలో జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ తరహాలో అంతర్జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించడం అరుదుగా జరుగుతుంది. అమెరికా ఖండ దేశాల్లో జికా వైరస్ విస్ఫోటం తరహాలో వ్యాపిస్తున్నదని ఈ సంస్థ గతవారం హెచ్చరించింది. ఈ ఏడాది నలబై లక్షల మంది ఈ వ్యాధికి గురయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆఫ్రికాను అతలాకుతలం చేసిన ఎబోలా వ్యాధి విషయంలో ఆలస్యంగా స్పందించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న దృష్ట్యా జికా వైరస్ విషయంలో సంస్థ సత్వర ప్రతిస్పందనకు చర్యలు తీసుకుంటున్నది. జికా వైరస్ వల్ల కలిగే వ్యాధి లక్షణాలు మరీ తీవ్రంగా లేకపోయినప్పటికీ ఈ వ్యాధికి గురైన గర్భిణులకు మెదడు సరిగా ఎదగని పిల్లలు(మైక్రోసెఫాలీ) పుడుతున్నారనే ప్రచారం ఆందోళన కలిగిస్తున్నది. నిజానికి రెండింటి మధ్య సంబంధం ఉన్నట్టు తిరుగులేని విధంగా రుజువు కాలేదు. పరిస్థితులను బట్టి జికా వైరస్‌కు, మైక్రోసెఫాలీకి మధ్య సంబంధం ఉన్నట్టు బలమైన అనుమానాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత మార్గరెట్ చాన్ తెలిపారు. నరాలు చచ్చుబడిపోయి పక్షవాతానికి గురిచేసే గ్యులియన్-బారీ సిండ్రోమ్ కూడా జికా వల్లనే వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం జికా వైరస్‌కు చికిత్స లేదు. టీకా తయారీకి మరో ఏడాది పడుతుందని అంటున్నారు. ఈలోగా మైక్రోసెఫాలీ, గ్యులియన్-బారీ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జెనీవాలో అసాధారణ సమావేశం నిర్వహిస్తున్నారు.

English summary

World Health Organisation(WHO) declares global emergency over explosive Zika Virus Spread.The UN health agency convened an emergency meeting of independent experts in Geneva to assess the outbreak after noting a suspicious link between Zika’s arrival in Brazil which leads to number of babies born with abnormally small heads.