దుమారం రేపుతున్న రోహిత్ వ్యవహారం

HCU Suicide Incident

06:51 PM ON 19th January, 2016 By Mirchi Vilas

HCU Suicide Incident

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య వ్యవహారం ముదిరిపాకాన పడింది. హైదరాబాద్ తో పాటూ తెలుగు రాష్టాలలో దుమారం రేపిన ఈ వ్యవహారం డిల్లీని తాకింది. ఈ ఘటనపై పెద్ద పెద్ద నాయకులు స్పందిస్తున్నారు. ఎపిలో పలు చోట్ల దళిత సంఘాలు , విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి. సోషల్ మీడియాలో కూడా ఈ ఘటనపై వాడీ వేడీ చర్చ సాగుతోంది. చానెల్స్ లో కూడా చర్చ నడిచింది.

రాహుల్ డిమాండ్ ...

రోహిత్ ఆత్మహత్య నేపధ్యంలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. మంగళవారం హెచ్‌సీయూలో పర్యటించిన ఆయన రోహిత్‌ కుటుంసభ్యులు, సహచర విద్యార్థులు, విద్యార్థి నాయకులతో మాట్లా డారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ రోహిత్‌ ఆత్మహత్య తనను తీవ్రంగా బాధించిందన్నారు. రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. యూనివర్శిటీల్లో పక్షపాత ధోరణి కారణంగా విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడితే వారి కుటుంబాన్ని పరామర్శించే నైతిక బాధ్యత వీసీకి లేదా? అని రాహుల్‌ ప్రశ్నించారు. వీసీ, కేంద్రమంత్రులు సరిగా వ్యవహరించనందువల్లే రోహిత్‌ ప్రాణాలు తీసుకున్నాడని ఆరోపించారు. తాను రాజకీయ నాయకుడిగా రాలేదని చెబుతూ, విద్యార్థులకు ఎప్పుడు అవసరమైనా అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ విద్యార్థులకు ఉండాలని రాహుల్‌ అభిప్రాయపడ్డారు. రోహిత్‌ కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

అసదుద్దీన్ డిమాండ్ ...

ఇక రోహిత్ కుటుంబానికి రూ.5 కోట్లు పరిహారం ఇవ్వాలని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మంగళవారం డిమాండ్ చేశారు. హెచ్‌సియు విద్యార్థుల ఆందోళనకు మద్దతు ఇస్తున్నామన్నారు. రోహిత్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్ర రావును బర్తరఫ్ చేయాలన్నారు. ప్రధాని మోడీకి ధైర్యం ఉంటే రోహిత్ మృతి పైన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేయాలన్నారు. వీసీ అప్పారావు స్వచ్చంధంగా వైదొలగాలన్నారు.

కేజ్రీవాల్ విసుర్లు ....

రోహిత్ ఆత్మహత్యపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. రోహిత్ ఆత్మహత్యపై ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్ లు చేశారు. రోహిత్ ది ఆత్మహత్య కాదని పేర్కొన్న కేజ్రీవాల్ అది ముమ్మాటికీ హత్యనేనని ఆరోపించారు. దళితుల ఉద్ధరణకు పాటుపడాల్సిన మోడీ ప్రభుత్వం ఐదుగురు దళిత విద్యార్థులను సస్పెండ్ చేసిందని దుయ్యబట్టారు. రోహిత్ ది ఆత్మహత్య కాదని ముమ్మాటికీ ప్రజాస్వామ్య హత్య సామాజికన్యాయం - సమానత్వ హత్య అని ఆరోపించారు. దీనికి బాధ్యులైన మంత్రులను మోడీ తన కేబినేట్ నుంచి సస్పెండ్ చేయాలంటూ కేజ్రీ ట్విట్టర్ లో డిమాండ్ చేశారు.

కిషన్ రెడ్డి స్పందన ....

రోహిత్‌ ఆత్మహత్య ఘటనలో బీసీ నేత అయిన కేంద్రమంత్రి దత్తాత్రేయను కాంగ్రెస్‌, టి ఆర్ ఎస్ లక్ష్యం చేసుకున్నాయని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. రోహిత్‌ ఆత్మహత్య ఘటనలో కేంద్రమంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కొన్ని పార్టీలు ఆత్మహత్య ఘటనను రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. దత్తాత్రేయ లేఖ రాయకముందే విద్యార్థులను వర్శిటీ సస్పెండ్‌ చేసిందని తెలిపారు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని రోహిత్‌ లేఖలోనే ఉందని, అయినా దీనిని కొందరు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.

English summary

Some of the politicians like Delhi Cheif Minister Kejriwal, All India Congress Commitee president Rahul Gandhi,MIM Leader Asaduddeen Owaisi responds on Hyderabad Central University(HCU) student Rohit Suicide Case