రధ సప్తమి నాడు ఏం చేస్తే మంచిదో తెలుసా

Health benefits from God Surya

11:29 AM ON 2nd February, 2017 By Mirchi Vilas

Health benefits from God Surya

ప్రత్యక్ష భగవానుడు. సమస్త జీవకోటికి ప్రాణాధారం సూర్యుడే మాఘశుద్ద సప్తమి సూర్యభగవానుడు పుట్టిన తిథి. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశా నిర్దేశాన్ని మార్చుకునే రోజు. అలాంటి సమయంలో చెయ్యాల్సిన కొన్ని పనులు చెయ్యటం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందటమే కాదు దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుందని మన శాస్త్రాలు చెపుతున్నాయి.

కొన్ని చోట్ల రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే స్నానం చేసే సంప్రదాయం ఉంది. రధ సప్తమి నాడు సూర్యోదయాన్నే ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నుంచుని స్నానం చేసేటప్పుడు మగవారు 7 జిల్లేడు ఆకులు,ఆడవారు 7 చిక్కుడు ఆకులు తలపై,భుజాలపై ఉంచుకుని

|| జననీ త్వం హి లోకానం సప్తమీ సప్తసప్తికే,

సప్తవ్యాహృతికే దేవి ! సమస్తే సూర్యమాతృకే || అనే మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి.

దీనర్ధం ఏమిటంటే "సప్తాశ్యములు గల ఓ సప్తమీ ! నీవు సకల భూతములకును, లోకములకును జననివి. సూర్యునికి తల్లినైన నీకు నమస్కారము'. అని.

తలపై ఏడు జిల్లేడు ఆకులు ( అర్క పత్రం) , ఏడు రేగు ఆకులు/రేగి పళ్ళు ఉంచుకొని స్నానము ఎందుకు చేస్తారంటే, సూర్యునికి అర్కః అన్న పేరు ఉంది.. అందుకే అర్క పత్రము ప్రీతి అంటారు. . స్నానము చేస్తూ " యత్యత్ జన్మ కురుమే పాపం మయా సప్తమ జన్మాసు, తన్మే రోగంచ, శోకంచ, మా కరేహంచు సప్తమీ..... " అని పఠిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల ఏడు జన్మల పాపాలను ( ఈ జన్మలో చేసినవి, జన్మాంతరంలోనివి, తెలిసి చేసినవి, తెలియక చేసినవి, మానసికంగా చేసినవి, వాచికంగా చేసినవి, శారీరకంగా చేసినవి) , సూర్యుడు ఏడు రకాల రోగాలను తొలగిస్తాడని భావిస్తారు. రధసప్తమి నాడు సూర్యుడు సప్తాశ్వములను పూన్చిన బంగారు రధం మీద రధసారధి అరుణుడు అంటే ఇతనికే అనూరుడు అనగా ఊరువులు లేనివాడు అని కూడా పేరు ఉందన్న మాట.

ఈ సప్తమినాడు ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యటం శ్రేయస్కరమట. మన పెద్దవాళ్ళు రథసప్తమి రోజు ఆరుబయట(సూర్యకిరణాలు పడే చోట) తూర్పు దిక్కున తులసికోట పక్కగా ఆవు పేడతో అలికి,దానిపై వరిపిండితో పద్మం వేసి,పొయ్యి పెట్టి ఆవుపేడతో చేసిన పిడకలు అంటించి, ఆవుపాలు పొంగించి,ఆ పాలల్లో కొత్తబియ్యం,బెల్లం,నెయ్యి,ఏలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు. తులసికోట ఎదురుగా ఏడూ చిక్కుడుకాయలతో రథం చేసి చిక్కుడుఆకులపై పరమాన్నం ఉంచి దేముడికి నైవేద్యంగా పెట్టేవారు. కాని ఇప్పుడు కాలం మారింది దానికి అనుగుణంగా మనం కూడా మారాల్సివచ్చింది. పొయ్యలు పోయి గ్యాస్ స్టవ్ లు వచ్చాయి కాబట్టి వాటినే ముందుగా శుభ్రం చేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవుపాలు పొంగించి దానితో ప్రసాదం చేసి సూర్యునికి నైవేద్యం పెట్టవచ్చు.

రథసప్తమి నాడు దేముడికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే మంచిదట. చిమ్మిలి దానం ఇస్తే సకలశుభాలు చేకూరుతాయని కొందరి నమ్మకం.

ఇలా రథసప్తమి నాడు చెయ్యాల్సిన వాటికి ముందురోజే ఏర్పాట్లు చేసుకుంటే ఆ రోజు శ్రమ లేకుండా చిత్తశుద్ధి తో సూర్యుడిని పూజించి ఆయన అనుగ్రహానికి పాత్రులు కావచ్చు.

ఇది కూడా చూడండి: రెండు కోట్ల ఇల్లుని చీప్ గా అమ్మేసింది ... కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఇది కూడా చూడండి: ఆయుష్షు పెరగాలంటే ఇవి తినాలట

English summary

we can get more health benefits from God Surya in Radha Sapthami.