రోజా సీను మారింది - హైకోర్టులో చుక్కెదురు 

High Court Gives Shock To Ysrcp MLA Roja

04:21 PM ON 22nd March, 2016 By Mirchi Vilas

High Court Gives Shock To Ysrcp MLA Roja

వైస్సార్ సిపి ఎమ్మెల్యే, నటి రోజాకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆమె సస్పెన్షన్‌పై సింగిల్‌ జడ్జి ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను సీజే ధర్మాసనం నిలిపివేసింది. రోజా వ్యవహారంలో హైకోర్టు సింగిల్‌ జడ్జి ధర్మాసనం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఏపీ శాసనసభ వ్యవహారాల కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌ పై ఇరువర్గాలు వాదనలు వినిపించారు. సోమవారం వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తితో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది.

ఎమ్మెల్యే రోజాను ఏపీ శాసనసభ నుంచి ఏడాది పాటు సస్పెండ్‌ చేస్తూ జారీ చేసిన తీర్మానంపై అమలును నిలుపుదల చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఈనెల 17న మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దాన్ని సవాల్‌ చేస్తూ శాసనసభ వ్యవహారాల కార్యదర్శి ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీల్‌ చేశారు. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయాలని కోరారు. దీనిపై తాజాగా తీర్పు వెలువరించిన ద్విసభ్య ధర్మాసనం... ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేసింది. కాగా వ్యూహాత్మకంగా రోజాను అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవడం, ఇప్పుడు రోజాకు వ్యతిరేకంగా తీర్పు రావడం చూస్తుంటే వైస్సార్ సిపికి , ముఖ్యంగా రోజాకు హైకోర్టులో మొన్న లభించిన ఊరట ఎందుకూ కొరగాకుండా పోయినట్లైంది.

హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ వైస్సార్సిపి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. ధర్మాసనం వెలువరించిన తీర్పు ప్రతులను రోజా తరపు న్యాయవాది కోరగా... కోర్టు బుధవారం ఇస్తామని చెప్పిందని అసెంబ్లీ కార్యదర్శి తరపు వాదనలు వినిపించిన న్యాయవాది వివరిస్తూ, తీర్పు ప్రతులు అందగానే వారు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందన్నారు. మొత్తానికి రోజాకు పరిస్థితి కల్సి రావడంలేదు.

English summary

Ysrcp Nagari MLA Roja has been suspended from Andhra Pradesh Assembly for one year and recently High Court has cancelled the suspension on her and A.P Government had challenged the Judgement and High Court Supported Andhra Pradesh Government's suspension on Roja.But Ysrcp party said that they were going to Supreme Court and challenge High Court Latest Decision.