భార్యపై అనుమానంతో పూజ గదిలోనే చంపేశాడు

Husband killed his wife in devotional room

11:56 AM ON 1st July, 2016 By Mirchi Vilas

Husband killed his wife in devotional room

కోపంతో రగిలిపోతూ, ఏమి చేస్తున్నారో తెలియని రోజులివి.. అందులో భాగంగానే ఇదో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. భార్యపై అనుమానంతో భర్తే ఆమె తలపై ఇనుపరాడ్డుతో మోది కడతేర్చాడు. వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు అనుమానించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. విజయనగరం జిల్లా కొత్తవలసలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. కొత్తవలస జంక్షన్ సమీపంలో కొత్తవలస-విజయనగరం రోడ్డులో కొన్నేళ్ల కిందట గోపీకృష్ణ పేరిట గోపీ పాపారావు హోటల్ నడుపుతున్నాడు.

ఇతనికి మేనకోడలు లక్ష్మీభవానీతో సుమారు ఇరవై ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే తొమ్మిదేళ్ల కిందట పాపారావుకు అంతుచిక్కని వ్యాధి ప్రబలింది. అప్పటి నుంచి భార్యభర్త మధ్య గొడవలు మొదలయ్యాయి. తనను పట్టించుకోవడం లేదంటూ భార్యను తరచూ వేధించడం ప్రారంభించాడు. మొత్తానికి చిలికి చిలికి గాలివానగా మారడంతో లక్ష్మీభవాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం కోర్టులో నడుస్తోంది. ఈ పరిణామాల తర్వాత పాపారావు హోటల్ లో ఉంటుండగా, వెనుకభాగంలో పిల్లలతో పాటు భార్య నివశిస్తోంది. అయితే నానాటికీ భార్యపై కోపం పెంచుకున్న పాపారావు ఆమె స్థానికంగా సెల్ పాయింట్ నడుపుతున్న నేమాలి శ్రీనివాసరావుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు అనుమానిస్తున్నాడు.

ఈ విషయమై పలుమార్లు భార్యను హెచ్చరించాడు. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో కోపంతో రగిలిపోతున్న పాపారావు సమయం కోసం చూశాడు. గురువారం ఉదయం పిల్లలిద్దరూ స్కూల్ కు వెళ్లిపోవడాన్ని గమనించాడు. అనంతరం పూజ గదిలో ఉన్న లక్ష్మీభవాని వద్దకు వచ్చి ఒక్కసారిగా తలపై ఇనుప రాడ్డుతో బలంగా కొట్టాడు. దీంతో ఆమె రక్తపుమడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అక్కడితో ఆగకుండా, తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు అనుమానిస్తున్న నేమాలి శ్రీనివాసరావు షాపునకు వెళ్లి అతని తలపైనా రాడ్ తో గాయపర్చాడు.

తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాసరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనల తర్వాత పాపారావు నేరుగా కొత్తవలస పోలీసుస్టేషన్ కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. భార్యను తానే హత్య చేశానంటూ గోపీ పాపారావు ఇచ్చిన వాంగ్మూలంతో సీఐ, ఎస్ఐ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం హోటల్ కౌంటర్ లో ఉన్న గోపీపాపారావు తమ్ముడు ఉమామహేశ్వరరావు దగ్గర వివరాలు సేకరించారు. శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శృంగవరపుకోట తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కొసమెరుపు ఏమంటే, ఈ తతంగం హోటల్ లో ఉన్న సిబ్బందికి తెలియక తమ పని తాము చేసుకుంటున్నారు.

ఈలోగా పోలీసులు ఒక్కసారిగా వచ్చి హడావిడి చేయడంతో హోటల్ సిబ్బంది విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారట.

English summary

Husband killed his wife in devotional room