లంకను జయించారు..

India Won Second T20 against Srilanka

10:18 AM ON 13th February, 2016 By Mirchi Vilas

India Won Second T20 against Srilanka

శ్రీలంక చేతిలో తొలి టీ20 మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి టీమిండియా బదులు తీర్చుకుంది. రాంచిలో శుక్రవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత జట్టు ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై టాస్‌ గెలిచిన శ్రీలంక కెప్టెన్‌ చండిమాల్‌ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలి టీ20లో విఫలమైన భారత ఓపెనర్లు రాంచిలో వరుస బౌండరీలతో చెలరేగిపోయారు. ధావన్‌ (51: 25 బంతుల్లో 7×4, 2×6), రోహిత్‌ శర్మ (43: 36 బంతుల్లో 2×4, 1×6) దుమ్మురేపారు. మైదానం నలువైపులా బంతిని బాదుతూ పరుగులు రాబట్టిన ఈ జోడి తొలి వికెట్‌కు 7 ఓవర్లలోనే ఏకంగా 75 పరుగులు జతచేసి భారీ స్కోరుకు బాటలు వేసింది. ఈ క్రమంలోనే టీ20ల్లో ధావన్‌ తొలి అర్ధశతకం నమోదు చేశాడు. అర్ధ శతకం అనంతరం స్కోరు 75 వద్ద ధావన్ చమీరా బౌలింగ్‌లో కీపర్‌ చండిమాల్‌కు సునాయాస క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం రహానె (25: 21 బంతుల్లో 3×4)తో కలిసి రోహిత్‌ రెండో వికెట్‌కి 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే 5 పరుగుల వ్యవధిలో రోహిత్‌, రహానె వెనుదిరిగినా.. హార్దిక్‌ పాండ్య (27: 12 బంతుల్లో 1×4, 2×6), రైనా (30: 19 బంతుల్లో 5×4) బ్యాట్‌ ఝుళిపించడంతో భారత్‌ 200పైచిలుకు స్కోరు చేసేలా కనిపించింది. కానీ.. ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో తిసార పెరీరా వరుస బంతుల్లో పాండ్య, రైనా, యువరాజ్‌ సింగ్‌(0)లను పెవిలియన్‌కు పంపి హ్యాట్రిక్‌ సాధించాడు. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.

భారీ లక్ష్య ఛేదనకు దిగిన పర్యాటక జట్టును భారత్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వరుసగా వికెట్లు తీస్తూ ఆత్మరక్షణలో పడేశారు. తొలి ఓవర్‌లోనే దిల్షాన్‌ను అశ్విన్‌ బౌలింగ్‌లో ధోనీ స్టంపౌట్‌ చేసి డకౌట్‌గా పెవిలియన్‌కు పంపగా.. రెండో ఓవర్‌లో ప్రసన్న(1)ను, నాలుగో ఓవర్‌లో గుణతిలక(2)లను ఔట్‌ చేసి నెహ్రా పర్యాటక జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు. అయితే కెప్టెన్‌ చండిమాల్‌ (31), కపుగెదెర (32), సిరివర్ధనె (27) కాసేపు లంక శిబిరంలో గెలుపు ఆశలు రేపినా.. పరుగులు, బంతులు మధ్య అంతరం పెరిగిపోవడంతో ఒత్తిడిలో వరుసగా వికెట్లు కోల్పోయారు. చివరికి లంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులకే పరిమితమై భారత్‌కు 69 పరుగుల విజయాన్ని అందించింది. ఈ విజయంతో టీమిండియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మక మూడో టీ20 ఆదివారం విశాఖపట్నంలో జరగనుంది.

English summary