ఆసీస్ పై రివేంజ్ తీర్చుకున్న టీమిండియా

India Wons T20 Series Against Australia

10:56 AM ON 30th January, 2016 By Mirchi Vilas

India Wons T20 Series Against Australia

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో ఎదురైన ఘోర పరాభవానికి టీ 20 సిరీస్ లో రివేంజ్ తీర్చుకుంది టీమిండియా. మరో టీ20 మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ ను టీమిండియా దక్కించుకుని ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది. టీ20ల్లో తిరుగులేని ప్రదర్శనతో టీమిండియా కంగారూల గడ్డపై దుమ్మురేపింది. మెల్‌బోర్న్‌లో శుక్రవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 27 పరుగుల తేడాతో ఆసీస్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. రోహిత్‌ శర్మ, కోహ్లి అర్ధశతకాలు సాధించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్‌ అరోన్‌ ఫించ్‌ (74: 48 బంతుల్లో 8×4, 2×6) ధాటిగా ఆడి మరో ఓపెనర్‌ షాన్‌ మార్ష్‌తో కలిసి తొలి వికెట్‌కు 9.5 ఓవర్లలో 94 పరుగుల భాగస్వామ్యంతో ఆసీస్‌ శిబిరంలో గెలుపు ఆశలు రేపాడు. అయితే భారత్‌ స్పిన్నర్‌ అశ్విన్‌.. మార్ష్‌(23)ను పెవిలియన్‌కు పంపి ఆసీస్‌ పతనాన్ని ఆరంభించగా.. ఆ తర్వాత ఒత్తిడిలో వరుసగా వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులే చేయగలిగింది. భారత్‌ బౌలర్లలో బుమ్రా 2, జడేజా 2, అశ్విన్‌, పాండ్య, యువరాజ్‌ తలో వికెట్‌ తీశారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో భారత్‌ కైవసం చేసుకుంది. తొలుత టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (60: 47 బంతుల్లో 5×4, 2×6), శిఖర్‌ ధావన్‌ (42: 32 బంతుల్లో 3×4, 2×6) ఆసీస్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఎడాపెడా బౌండరీలు బాదేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 11 ఓవర్లలో 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ భారీ స్కోరుకు బాటలు వేశారు. అయితే మాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌ షాట్‌ కోసం ప్రయత్నించి ధావన్‌ ఔటవగా.. కోహ్లితో సమన్వయలోపం కారణంగా జట్టు స్కోరు 143 పరుగుల వద్ద రోహిత్‌ శర్మ రనౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. రోహిత్‌ ఔట్‌ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ ధోనీ (14: 9 బంతుల్లో 2×4)తో కలిసి విరాట్‌ కోహ్లి (59 నాటౌట్‌: 33 బంతుల్లో 7×4, 1×6) స్లాగ్‌ ఓవర్లలో దూకుడుగా ఆడటంతో భారత్‌ 185 పరుగుల భారీ లక్ష్యాన్ని కంగారూలకు నిర్దేశించగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మాక్స్‌వెల్‌, ఆండ్రూ టై చెరో వికెట్‌ తీశారు. ఆస్ట్రేలియా, భారత్ మధ్య మూడో టీ20 మ్యాచ్‌ సిడ్నీ వేదికగా ఆదివారం జరగనుంది.

English summary

India Won T20 series against Australia in Australia for the first time in Cricket History.Indian Crircket team won two matches in three match series.