ఐటీ దాడుల్లో వెలుగు చూస్తున్న అక్రమాలు... మరో రూ.106 కోట్లు స్వాధీనం....

IT Officials Found 106 Crores New 2000 Currency Notes In Raid

11:58 AM ON 10th December, 2016 By Mirchi Vilas

IT Officials Found 106 Crores New 2000 Currency Notes In Raid

ఓపక్క డబ్బులకోసం జనం క్యూలు కడుతుంటే, మరోపక్క దొడ్డిదారిన బడాబాబులకు బ్యాంకర్లు కట్టలకొద్దీ డబ్బు ఇచ్చేసారు. ఒక్కొక్కటి వెలుగుచూస్తున్న ఇలాంటి అక్రమాలు చూసి జనం నిర్ఘాంత పోతున్నారు. మొన్నటికి మొన్న టీటీడీ పాలకమండలి సభ్యుడు శేఖర్ రెడ్డి వద్ద రూ.90 కోట్లు బయటపడిన ఇంకా చెరిగిపోక ముందే, చెన్నైలో మళ్లీ పెద్ద ఎత్తున సొమ్ము బయటపడింది. ఆదాయపన్నుఅధికారులు శుక్రవారం పలుచోట్ల నిర్వహించిన సోదాల్లో రూ.106 కోట్ల నగదుతో పాటు 127 కేజీల బంగారం పట్టుబడింది. ఇందులో రూ.10 కోట్ల మేర కొత్త నోట్లు కూడా ఉండడం విశేషం. ఒక్కోటి కిలో బరువున్న 127 బంగారపు కడ్డీలు, రూ.96 కోట్ల పాత కరెన్సీ నోట్లు, రూ.10 కోట్ల మేర రూ.2000 కొత్తనోట్లు తమ సోదాల్లో బయటపడినట్టు ఐటీ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

ఇటీవల ఆదాయపన్ను అధికారులకు ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము పట్టుబడడం ఇదే తొలిసారి. శేఖర్ రెడ్డి సహా మరికొందరి కార్యకలాపాలపై నిఘా అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఐటీ శాఖ విస్తృత సోదాలు నిర్వహిస్తోంది. కాగా పట్టుబడిన కొత్త కరెన్సీకి సంబంధించి కనీసం బ్యాంకు రసీదులు కూడా లేకపోవడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కరెన్సీ మార్పిడి కోసం కొందరు సిండికేట్ గా ఏర్పడినట్టు సమాచారం రావడంతో అధికారులు మొత్తం ఎనిమిది చోట్ల సోదాలు నిర్వహించారు.

గుజరాత్ లో రూ.76 లక్షల కొత్త రెండువేల నోట్లు

ఇక గుజరాత్ లో రూ.76 లక్షల కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. ఇవన్నీ కూడా కొత్త రూ.2000 నోట్లే కావడం విశేషం. మహారాష్ట్రకు చెందిన ఎంహెచ్ 15 ఈపీ 4455 నెంబర్ గల కారును శుక్రవారం సూరత్ పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అందులో రూ.76 లక్షల విలువైన 3,800 కొత్త రూ.2000 నోట్లు బయటపడ్డాయి. ఈ డబ్బును సచిన్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చేందుకు నాసిక్ నుంచి తీసుకొస్తున్నట్లు తేలింది. కారు, డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఓ మహిళతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. సూరత్ ఆదాయ పన్నుశాఖ దీనిపై దర్యాప్తు చేస్తోంది.

కొత్తగా ముద్రించే కరెన్సీ ఎలా ఉంటుందంటే ...

ఓపక్క కరెన్సీ కష్టాలు జనానికి పీడకలలు తలపిస్తుంటే, మరోపక్క ప్రభుత్వం ప్లాస్టిక్ కరెన్సీ గురించి కసరత్తు మొదలెట్టింది. క్షేత్ర స్థాయిలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన తర్వాత ప్లాస్టిక్ కరెన్సీని ప్రారంభించాలని భారతీయ రిజర్వు బ్యాంకు చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. ఎంపిక చేసిన ఐదు నగరాల్లో రూ.100 కోట్ల విలువైన 10 రూపాయల ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టబోతున్నట్లు 2014 ఫిబ్రవరిలో ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. కొచ్చి, మైసూరు, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్ లలో వీటిని ప్రవేశపెడతామని పేర్కొంది. ప్లాస్టిక్ నోట్ల జీవిత కాలం సుమారు ఐదేళ్ళు. వాటి నకిలీ నోట్లను తయారు చేయడం చాలా కష్టం. కాగితపు నోట్ల కన్నా ప్లాస్టిక్ నోట్లు పరిశుభ్రంగా ఉంటాయి. నకిలీ నోట్ల బెడదను తప్పించుకునేందుకు మొట్టమొదటిసారి ఆస్ట్రేలియా ఈ నోట్లను ముద్రించి, చలామణిలోకి తీసుకొచ్చింది.

ఇక ప్లాస్టిక్ కరెన్సీ గురించి ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ లోక్ సభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్లాస్టిక్/ పాలిమర్ పదార్థంతో బ్యాంకు నోట్లను ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. ఈ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. కాగితపు కరెన్సీకి బదులుగా ప్లాస్టిక్ కరెన్సీని ముద్రించాలని ఆర్బీఐ ప్రతిపాదించిందా? అన్న ప్రశ్నకు మేఘ్ వాల్ ఈ సమాధానం ఇచ్చారు.

English summary

Recently IT Officials found 70 crores of New 2000 Currency notes and now another 106 crores of new currency notes have been found in IT raids in Chennai.