ఆస్తులు అమ్మేసి పేదలకు భోజనం పెడ్తున్న 'బనానా కింగ్'

Jagdish Lal Ahuja sold his properties and helping poor

10:56 AM ON 29th June, 2016 By Mirchi Vilas

Jagdish Lal Ahuja sold his properties and helping poor

ఒకచోట బిర్యాని బాబా, మరోచోట కరుణా సాగర ఇలా పలుచోట్ల వృద్ధులను, పిల్లలను, అన్నార్తులను, రోగులను ఆదుకోడానికి ఉచిత భోజనం పెడుతున్న ఘటనలు చూస్తున్నాం. ఇప్పుడు మనం చూసేది కూడా అలాంటిదే. అయితే ఇతని స్టైల్ వేరు. మొత్తం ఆస్తులను అమ్మేసి ఉచితంగా భోజనం పెడుతున్నాడు. బనానా కింగ్ గా పేరొందాడు. నిజంగా పేదలకు పట్టెడన్నం పెట్టాలని ఆయన పడుతున్న తాపత్రయం, తపన చూస్తే ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అతని పేరు జగదీష్ లాల్ అహుజా... ఇప్పుడు అహూజా వయస్సు 80 సంవత్సరాలు. అయినా ఆయన ఇప్పటికీ స్వయంగా వచ్చి పేదలకు భోజనం వడ్డిస్తుంటాడు.

దీని గురించి ఆయన్ని ప్రశ్నిస్తే తన ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు ఆ సేవ ఆగదని చెబుతున్నాడు. పాకిస్థాన్ లోని పెషావర్ లో పుట్టిన అహుజా జన్మించిన 1947లో భారత్ కు స్వాతంత్ర్యం సిద్ధించాక వారి కుటుంబం పాటియాలాకు వలస వచ్చింది. అప్పుడు అహుజాకు 12 ఏళ్లు. అనంతరం వారు చండీగఢ్ కు మారారు. అక్కడే జగదీష్ విద్యాభ్యాసం కూడా ముగిసింది. కాగా అహుజా ఉద్యోగం చేయకుండా మార్కెట్లో పండ్లు, కూరగాయలను టోకున అమ్మే వర్తకుడిగా వ్యాపారం ప్రారంభించాడు. అనతి కాలంలోనే అది బాగా వృద్ధి చెందడంతో అతనికి సంపద కూడా చేకూరింది.

ఈ క్రమంలో జగదీష్ కు బనానా కింగ్ అనే పేరును కూడా స్థానిక వర్తకులు పెట్టేశారు. అంతలా అతని వ్యాపారం వృద్ధి చెందింది మరి. కానీ జగదీష్ మాత్రం తనకు కలిగిన సంపదనంతా పేదల కోసమే ఖర్చు చేసేవాడు. ఈ క్రమంలో గత 15 ఏళ్ల కిందట ఓ రోజు చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(పీజీఐఎంఈఆర్) వద్ద ఉన్న హాస్పిటల్ ఆవరణలో ఆకలితో అల్లాడిపోతున్న పేదలను అతను గమనించాడు. వారిని చూసిన జగదీష్ హృదయం చలించిపోయింది. అంతే, వెంటనే వారికి ఉచితంగా భోజనం పెట్టించాడు. ఆ తరువాత నుంచి తానే ఇంటి వద్ద వంటలు చేయించి వాటిని కారులోకి ఎక్కించి మరీ ఆ పీజీఐఎంఈఆర్ హాస్పిటల్ వద్ద ఉన్న పేదలకు ఆహారాన్ని అందించడం మొదలు పెట్టాడు.

ఒక్కొక్కరికి మూడు చపాతీలు, ఆలూ చనా కూర, హల్వా, ఒక అరటి పండు, స్వీట్లు, బిస్కట్లు ఇవ్వడం ప్రారంభించాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాల హాస్పిటల్ వద్దకు వచ్చే పేదలకు కూడా అహూజా ఉచితంగా భోజనాన్ని అందించడం మొదలు పెట్టాడు. అలా అతను ఆ రెండు హాస్పిటల్స్ లోనూ గత 15 ఏళ్లుగా పేదలకు భోజనం పెడుతూ వస్తున్నాడు. అయితే అప్పుడప్పుడు వారికి బ్లాంకెట్లు, స్వెటర్లు, దుస్తులను కూడా పంచుతుంటాడు. ఈ నేపథ్యంలో తనకు వ్యాపారం ద్వారా వచ్చిన పలు ఖరీదైన భవనాలను కూడా అతను పేదల కోసం అమ్మేశాడు.

వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతోనే అన్నార్థులకు భోజనం పెడుతున్నాడు. మొత్తానికి బనానా కింగ్ ఎందరికో స్ఫూర్తినిస్తున్నాడు.

English summary

Jagdish Lal Ahuja sold his properties and helping poor