యుద్ధానికి సన్నద్ధమవ్వాలంటూ పవన్ పై జన 'సేన' ఒత్తిడి!

Janasena Activists Pressure on Power Star Pawan kalyan

11:39 AM ON 11th July, 2016 By Mirchi Vilas

Janasena Activists Pressure on Power Star Pawan kalyan

ప్రశ్నించడానికే వచ్చా అంటూ జనసేన పార్టీని స్థాపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మౌనంగా - మెత్తగా ఉన్నప్పటికీ, ఆ పార్టీని - అధ్యక్షుడిని నమ్ముకున్న కార్యకర్తలు మాత్రం తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. అవినీతిపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. అంతేకాదు ప్రజాక్షేత్రంలో నిలబడి తమ సత్తా చాటేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. మరో అడుగు ముందుకేసి మిత్రపక్షాల అవినీతిపై సమరశంఖం పూరించేందుకు సిద్ధమయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మనసులో ఏముందో తెలియదు కానీ.. విశాఖ జనసేన కార్యకర్తలు మాత్రం మాంచి ఊపుమీదున్నారు.

ముఖ్యంగా విశాఖలో జనసేన పార్టీ కార్యకలాపాలకు వారు దశ దిశ నిర్దేశించుకుంటున్నారు. అంతేకాదు టీడీపీ - బీజేపీలతో జనసేన కలిసి ఉండడాన్ని వారు అస్సలు సహించలేక పోతున్నారు. ఆ రెండు పార్టీలూ ప్రజలకు అన్యాయం చేస్తున్నాయని అవినీతిలో కూరుకుపోతున్నాయని జనసేన కార్యకర్తలు తెగ బాధపడ్డారు. ఈ నేపథ్యంలో టీడీపీ - బీజేపీలతో తెగదెంపులు చేసుకునే విషయమై జనసేన కార్యకర్తలు పవన్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారట. విశాఖ నగరంలో త్వరలో జరగనున్న నగర పాలక ఎన్నికల నాటికి టీడీపీ - బీజేపీలకు గట్టి పోటీ ఇవ్వడం ద్వారా సేన సత్తా చాటాలని జనసేన కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారట. ఇందుకోసం వారి ఏర్పాట్లు వారు చేసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది.

'విశాఖలో కాలుష్య నివారణ విషయంలో ప్రభుత్వం విఫలం చెందింది. హుదూద్ తుఫానుకు సంబంధించి చేపట్టిన సహాయక చర్యల్లో అవినీతి చోటుచేసుకుంది' అని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ రెండు విషయాల పై ఆందోళన చేసేందుకు, విశాఖపట్నం నగర పాలక సంస్థ(జీవీఎంసీ)లోని 72 వార్డుల్లో కూడా ఇప్పటికే జనసేన సమావేశాలు నిర్వహించింది. వార్డుల వారీగా ప్రజల సమస్యల పై అధ్యయనం చేసి, నివేదిక పవన్ కి సమర్పించాలనే యోచనలో జనసేన కార్యకర్తలు ఉన్నారు. భవిష్యత్ కార్యాచరణ పై సూచనలు సలహాలు చేయమని పవన్ ను కోరనున్నారు.

సమావేశంలో మెజారిటీ కార్యకర్తలు టీడీపీ బీజేపీలతో తెగదెంపులు చేసుకునేందుకే మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. ప్రజలలో ఆ రెండు పార్టీలపై వ్యతిరేకత మొదలైందని మిత్ర పక్షం గా ప్రజలకు తాము సమాధానం చెప్పలేకపోతున్నామని కూడా కార్యకర్తలు అంటున్నారు. ఈ విషయంలో పవన్ పై ఒత్తిడి తెచ్చేందుకు వారు సిద్ధమవుతున్నారు. అయితే ఏ విషయంలోనైనా ఆచితూచి అడుగేసే పవన్ ఇప్పుడు తన కార్యకర్తల డిమాండ్పై ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. ఏదేమైనా జనసేన కార్యకర్తల్లో వేడి పుట్టడం ఆశించదగిన పరిణామమన్న టాక్ ఏపీ రాజకీయాల్లో వినిపిస్తోంది. జనసేన కార్యకర్తలు జోరుగా దూసుకెళుతుంటే నాయకుడు పవన్ మాత్రం మౌనంగా ముందుకు వెళుతున్నారు. ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇది కూడా చూడండి: చిరు ఇల్లు ఖరీదు ఎంతో తెలిస్తే షాకౌతారు!

ఇది కూడా చూడండి: భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు

ఇది కూడా చూడండి: ఈ దేశాల్లో మన రూపాయి చాలా రిచ్

English summary

Janasena Activists Pressure on Power Star Pawan kalyan.