తమిళనాడు శివగామి జయలలిత 

Jaya Lalitha Photos On Food Packages

12:08 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Jaya Lalitha Photos On Food Packages

చెన్నై నగరం ఒక పక్క వరద తెచ్చి పెట్టిన కష్టంతో ఆపసోపాలు పడుతుంటే, ఈ కష్ట కాలంలో ఆదుకోవాల్సింది పోయి, పబ్లిసిటీ మోజులో కొట్టుమిట్టాడుతున్నారు కొందరు నాయకులు. స్వచ్ఛంద సంస్థలు, యువకులు ప్రతీ ఒక్కరూ ఒక యజ్ఞంలా సేవా కార్యక్రమాలలో పాల్గంటుండగా, అక్కడి ప్రభుత్వం మాత్రం సేవాకార్యక్రమాలను సైతం రాజకీయ మైలేజీకి వినియోగించుకుంటుంది. విపత్తులో చిక్కుకున్న జనానికి అందించే ఆహారపొట్లాలపైనా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చిత్రపటం దర్శనమివ్వడం ఇప్పుడు పలు విమర్శలకు దారితీస్తోంది. ఆపన్నులను తక్షణమే ఆదుకోవడానికి పూనుకోవడం కన్నా, అమ్మగారి చిత్రపటం ముద్రించడంపైనే అధికారులు శ్రద్ధ కనబరుస్తున్నారంటూ విమర్శలు గుప్పుమంటున్నాయి. దీనికి తోడు అమ్మ అభిమానులు ఇప్పుడు జయలలితను తమిళనాడును కాపాడే బాహుబలితో పోల్చుతూ చెన్నై నగరం గోడలను నింపేస్తున్నారు. రాజమౌళి బ్లాక్‌బస్టర్‌ చిత్రంలో బాహుబలి చిత్రం పోస్టర్‌ను పోలి ఉండేలా జయలలిత చేతిలో ఒక పిల్లాడిని పట్టుకుని ఎదురీదుతున్నట్లు తయారు చేసిన పోస్టర్‌ను జనం ముక్కున వేలేసుకుంటున్నారు. వరద తమ గూడుని, కూడగట్టుకున్నదాన్ని ఎత్తుకుని పోయి సాయం కోసం చేతులు చాస్తున్న వేళ ఈ పరాచికాలు ఏమిటంటూ జనం గుసగుసలాడుకుంటున్నారు.

ఇంతకుమించిన ఘోరమైన విషయమేమిటంటే, ఇతర రాష్ట్రాలనుండి వచ్చే సహాయక సామాగ్రిపైన, వస్తువులపైన కూడా అమ్మగారి అభిమానులు దౌర్జన్యంగా అమ్మవారి చిత్రపటాలను తగిలిస్తున్నారట. కోయంబత్తూరు నుండి స్వచ్ఛందంగా వచ్చిన ఆరు ట్రక్కుల్లోని వరద సహాయక సామాగ్రిపై జయమ్మ చిత్రపటాలను బలవంతంగా అంటించి పంపేసారు. దీంతో వారు చేసేదేమీ లేక వాటినే పంపణీ చేసారుట. అంటే సాయం ఒకరిది...పేరు మాత్రం ఇంకొకరిదీ అన్నమాట.

వీటికి సంబంధించి సోషల్‌మీడియాలో మాత్రం ఘాటుగానే విమర్శలు ఎదురవుతున్నాయి. వీటిపై ఎఐడిఎంకే పార్టీ తమ పార్టీకి సంబంధించిన వరద సామాగ్రిపైన మాత్రమే జయలలిత పోస్టర్లను ముద్రించామని, ఇతరుల వస్తువులపై ఎలాంటి చిత్రపటాలను అంటించలేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

English summary

The people in chennai were angry for printing the jaya lalitha photos on chennai relief packages and in food packets.AIADMK party workers are priniting Jaya Lalitha Photos on the relief packets