తమిళనాట హిస్టరీ రిపీట్.. అంత దాపరికం ఎందుకో?

Jayalalitha health controversy

03:20 PM ON 6th October, 2016 By Mirchi Vilas

Jayalalitha health controversy

తమిళనాట రాజకీయాలు వెరైటీగా ఉంటాయి. వరుసగా రెండోసారి ఎన్నికల్లో గెలిచి సీఎం పీఠం సొంతం చేసుకున్న జయలలితకున్న ప్రజాదరణ అంతా ఇంతా కాదు. ఆమె ఆసుపత్రిలో చికిత్స కోసం జాయిన్ అయి రెండువారాలు దాటింది. అయినా అసలు ఆమె ఆరోగ్యం ఎలా ఉందన్న విషయం మాత్రం పూర్తిగా బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆమె బానే ఉందనే విషయం తప్ప ఇంకేమీ తెలియడంలేదు. జయకు గల పాపులారిటీ రీత్యా.. అక్కడ చెలరేగే వదంతులు రేపటిరోజున శాంతిభద్రతల సమస్యకు దారితీయొచ్చన్నదే భయాలకు కారణం అవుతోంది. ఇక అదిగో పులి.. ఇదిగో తోకల వార్తలకు చెక్ పెట్టకపోతే, ప్రమాదం తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

అయితే ఇక్కడే ఓ పాత సంఘటన గుర్తు చేసుకోవాలి. ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కూడా దాదాపు ఇదే పరిస్థితి. విదేశాల్లో చికిత్సకు వెళ్ళివచ్చిన ఎంజీఆర్ నోట మాట రావడం లేదని వార్తలొచ్చిన నేపథ్యంలో.. ఆనాడు జరిగిపోయిన పెద్ద రభసతో.. ఆయన మాటలతో రికార్డ్ చేసిన ఒక టేపును పార్టీ విడుదల చేసింది. పరిస్థితిని కొంత అదుపులోకి తీసుకుని రావడానికి అప్పట్లో పార్టీ చేసిన ప్రయత్నం అది. అంతేకాదు బెడ్ మీద ఉండగానే ఎన్నికల్లో ఆయన నామినేషన్ పై సంతకం చేసి గెలిచారు కూడా. ఆ తర్వాత ఆయన మరణించడం, ఆపైన పార్టీ పగ్గాల్ని ఆయన శ్రీమతి చేపట్టాలా లేక.. జయలలిత తీసుకోవాలా అన్న విషయం రోజులు కాదు వారాలు సస్పెన్స్ కొనసాగిన నేపథ్యం అది!

ఇక తమిళనాట ఇటువంటి పరిస్థితులు కరుణానిధి ఆరోగ్యం విషయంలోనూ నెలకొన్నాయన్నది అందరికీ ఎరుకే. కాగా మొన్నటికిమొన్న ఆమె అక్రమాస్తుల కేసులు జైలుకు వెళ్లినప్పుడు తాత్కాలిక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పన్నీర్ సెల్వం ఏ కీలక నిర్ణయం తీసుకోకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూపోయిన కాలంలో ఆ రాష్ట్ర పరిపాలన దాదాపుగా స్థంభించిపోయింది. జయలలితే పార్టీ.. పార్టీయే జయలలిత! క్యాబినెట్‌ లో ఎవరూ ఆమె స్థాయివైపు తలెత్తి చూసే ధైర్యాలు లేవు. అందరూ ఆమె కాళ్లు మొక్కేవాళ్లే! ఇప్పుడు జయ విషయంలోనూ ఓ ఆడియో బయటకు వచ్చింది. తన ఆరోగ్యం బానే ఉందంటూ ఆమె అందులో చెప్పుకొచ్చారు.

ఆ వాయిస్ ఆమెదేనా కాదా అన్నది చర్చ కూడా నడుస్తోంది. ఆ విషయం పక్కన పెడితే, అసలు విషయం ఏమిటో తెలియాలి. ఒకవేళ, ఆరోగ్య పరిస్థితి కుదుటపడి తిరిగి పాలనావ్యవహారాలు చేపట్టాలనే ఆశిద్దాం. కానీ.. అంతవరకూ పరిస్థితి ఏంటన్నదే ప్రశ్న. ట్రాన్స్‌ పరెన్సీ అనే మాట జయ ఆరోగ్య విషయంలో లేకుండా పోయింది. ఇవాళ తమిళనాట పారదర్శకత అత్యవసరం. జయలలిత కేవలం.. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రమే కాదు. ఇవాళ్టి పార్లమెంట్‌ లో మూడో అతిపెద్ద పార్టీకి అధినేత్రి. ఆమె తర్వాత సెకండ్ లెఫ్టినెంట్ ఎవరన్న విషయంలో నమ్మదగిన సమాచారం లేదు. ఇవాళ ఆమె ఆరోగ్య విషయంలో నిజాల్ని దాచిపెట్టడం అవాంఛనీయం.

అటు పార్టీపరంగా, ప్రభుత్వపరంగా శ్రేయస్కరం కాదన్నది పదేపదే వినిపిస్తున్న మాట. పైగా.. ఇటువంటి దాపరికాలు వదంతులు, పుకార్లకు తావిస్తున్నాయి. అదిగో పులి.. ఇదిగో తోక అంటూ చేస్తున్న పుకార్ల షికార్లు చెప్పనలవి కాదు. అమ్మా.. అమ్మా అంటూ వినిపిస్తున్న వదంతులు ఓ వైపు, సర్వమతప్రార్థనలు, రాత్రీపగళ్లను మరిచి అపోలో ఆస్పత్రి బయట కాపుకాస్తున్న పోలీసులు జర్నలిస్టుల ఎదురుచూపులు ఇలా అక్కడ నెలకొన్న అగమ్యగోచర పరిస్థితికి అద్దం పడుతోంది. తమిళనాట అభిమానుల అత్యుత్సాహాలు మనకు కొత్తేమి కాదు. ఏది ఏమైనా జయ సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావాలని ఆశిస్తూ, ఇప్పటికైనా వాస్తవాన్ని బయటకు వెల్లడించాలని పలువురు చెప్పేమాట.

English summary

Jayalalitha health controversy