జగన్ తీరుపై జేసి చురకలు 

Jc.Diwakar Reddy Fires On Jagan

03:06 PM ON 21st December, 2015 By Mirchi Vilas

Jc.Diwakar Reddy Fires On Jagan

ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు చెబుతూ, చెణుకులు విసురుతూ, ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలకు వేదికగా నిలిచే జేసి సోమవారం నాడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనలో ఇంకా కాంగ్రెస్ పార్టీ రక్తం ఉందని చెబుతూనే, అదే సమయంలో ప్రతిపక్షం వైసిపి తీరుపై మండిపడ్డారు.

' కాల్ మనీ అంటూ రోజూ గొడవ చేస్తూ, డబ్బులు అవసరమైన వారికి అప్పులు పుట్టకుండా చేస్తున్నారు. వడ్డీ వ్యాపారం అనేది ప్రతి ఊర్లో వుంది. నేను పుట్టకముందు నుంచే వడ్డీ వ్యాపారం వుంది. వడ్డీ వ్యాపారం చేయడం తప్పు కాదు. ఎక్కువ వడ్డీ వసూలు చేయడమే తప్పు 'అని అనంతపురం పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంతకీ వైసిపి అధినేత జగన్ స్వగ్రామంలో వడ్డీ వ్యాపారం లేదా అని ఆయన ప్రశ్నించారు.

అనవసర రాద్ధాంతం వలన విపక్ష నేతలంతా తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునే వారి కడుపు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్ మనీ అన్ని ప్రాంతాల్లో ఉందని చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడైనా కాల్ మనీ వ్యాపారం చేసుకోమని ఎవరికైనా సూచించారా అని విపక్షంపై జేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో గోల చేయడం తప్పితే విపక్షం ఏం చేసిందన్నారు. ఎవేరేవరితోనో ఫోటోలు దిగితే వాళ్ళు చేసే పనులతో మాకు సంబంధం వున్నాట్టా అని ఆయన నిలదీసారు. మరి పులివెందులలో జరిగే కాల్ మనీతో జగన్ కి సంబంధం ఉన్నట్టా అని ఆయన ప్రశ్నించారు. కాల్ మనీపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఇంత గొడవ చేసి జగన్ సాధించిందేమిటని ఆయన ప్రశ్నించారు.

కామ చంద్రబాబు అంటూ వైసిపి ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యల పైన జెసి మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. రోజా సస్పెన్షన్ స్పీకర్ నిర్ణయమని, దాని గురించి తాను మాట్లాడనని చెప్పారు.

రాజకీయాలు స్వచ్ఛంగా లేవని, అనవసరంగా రాద్ధాంతం చేయడం, గొడవ చేయడం తప్ప మరో పని లేదని జేసి పేర్కొంటూ, అసెంబ్లీలో ఆ అరుపులు ఏమిటని ఆయన ప్రశ్నించారు. మనం మనుషులమా లేక అడవిలో జంతువులమా అన్నారు.

చంద్రబాబు కొరడా ఝాలిపించడం లేదని జేసి అంటూ ,కఠిన త్వం వలన ఇబ్బంది వస్తుందేమోనని చంద్రబాబు భావిస్తున్నారేమోనని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా తనలో ఇంకా కాంగ్రెస్ రక్తం ఉందని, అయినప్పటికీ చంద్రబాబు పైన నమ్మకంతో టిడిపిలో చేరానని చెప్పారు.

English summary

Mp Jc. Diwakar Reddy fires on Jagan Mohan Reddy . He says that jagan and hius party were mis behaving in Assembly