ఎన్డీఏను ఏకాకిని చేసే దిశగా జెడియు వ్యూహం

JDU Planning to Defeat NDA

02:51 PM ON 18th November, 2015 By Mirchi Vilas

JDU Planning to Defeat NDA

కేంద్రంలోని బిజెపి సారధ్యంలో గల ఎన్డీఏను ఏకాకిని చేసేందుకు, తన పోరాటానికి మరింత పదును పెట్టేందుకు జనతా దళ్‌ యునైటెడ్‌ (జెడియు) పావులు కదుపుతోంది. కలిసి వచ్చే అన్ని పక్షాలతో సంప్రదింపులు జరుపుతూ ఈ వ్యూహానికి పదునుపెడుతోంది. నవంబర్‌ 20న బీహార్‌ ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్‌ ప్రమాణ స్వీకారం జరుగనున్న నేపధ్యంలో ఈ వేదికను ఎన్డీఏయేతర పక్షాలను ఏకం చేసే విధంగా జెడియు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను, వివిధ పార్టీల అగ్రనేతలకు ఆహ్వానాలు పంపారు. ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, తృణముల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ, ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య (కర్నాటక), తరుణ్‌గోగోయ్‌ (అస్సాం), హరీష్‌రావ్‌ (ఉత్తరాఖండ్‌), టి.ఆర్‌. జియాంగ్‌ (నాగాలాండ్‌), పంజాబ్‌ ఉపముఖ్యమంత్రి, అఖాలీదళ్‌ అధినేత సుఖుభీర్‌సింగ్‌ బాదల్‌, జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, ఆయన తండ్రి అయిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూఖ్‌ అబ్దుల్లా, జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రులు బాబూలాల్‌ మరాండీ, శిబూ సోరెన్‌ ఇంకా పలువురు నేతలను నితీష్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. అలాగే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఎఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీలను కూడా ఆహ్వానించారు. ఇందులో దాదాపు అందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతారన్న సంకేతాలు వస్తున్నాయి. మరోప్రక్క బిజెపి నేత శతృఘ్నసిన్హా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇప్పటికే ఈయన నితీష్‌ను, లాలూప్రసాద్‌ను కలిసి అభినందనలు తెలపడం, బిజెపి నేతల నుంచి విమర్శలు ఎదుర్కోవడం తెలిసిందే. మొత్తానికి ఎన్డీఏను ఇరుకున పెట్టే విధంగా జెడియు నితీష్‌ ప్రమాణ స్వీకారోత్సవ వేడుకను సన్నద్ధం చేస్తోంది. డిసెంబర్‌లో జరగనున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల నేపధ్యంలో కేంద్రంపై పోరాటానికి జెడియు తన అస్త్రాలను సన్నధ్ధం చేసుకుంటోందని చెప్పవచ్చు.

English summary

JDU Planning to Defeat NDA