కాల్ మనీ పై న్యాయ విచారణకు నిర్ణయం  

Judicial inquiry on Cal Money Case

06:38 PM ON 16th December, 2015 By Mirchi Vilas

Judicial inquiry on Cal Money Case

కాల్ మనీ అరాచకాలపై హైకోర్టు రిటైర్డ్ జడ్జీతో విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈవిషయం తెలిపారు. బుధవారం కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాల్ మనీ వ్యవహారంలో ఎంతటి వారున్నా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విచారణ జరిపించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. త్వరలోనే కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. సమగ్ర దర్యాప్తు అనంతరం నివేదిక వచ్చిన తర్వాత నిందితులందరిపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో మనీలాండరింగ్ చట్టం ఉండేదని ఆయన గుర్తుచేస్తూ, ప్రస్తుతం తెలంగాణలోనూ ఆ చట్టం ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాల్ మనీ అరాచకాలను అరికట్టేందుకు మనీలాండరింగ్ చట్టానికి కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు చెప్పారు.

కాల్ మనీలో వైసేపి వారే ఎక్కువట ...

కాగా కాల్ మనీ కేసులో అత్యధికులు వైసీపీవారే వున్నారని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. అందుచేత తెలుగుదేశం పార్టీని విమర్శించే అర్హత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి గానీ, కాంగ్రెస్ ఏపి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కి గానీ లేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు సీఎం అంటే కాల్ మనీ అంటూ ఎద్దేవా చేస్తున్న రోజాపైనా టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కేసులో 80 మంది అరెస్టయితే అందులో 27 మంది వైసీపీవారే ఉన్నారని.... అలాంటప్పుడు కాల్ మనీకి సీఎంకు ఎలా లింకు పెడతారని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఇక 17నుంచి జరగబోయే ఎపి అసెంబ్లీ సమావేశాలలో కల్తీ మద్యం , కాల్ మనీ వ్యవహారాలపై వాడీ వేడీ చర్చ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో కరువు , అధిక వర్షాలు , వరదల వలన నష్టం , చిత్తూరు మేయర్ దంపతుల హత్య నేపధ్యంలో శాంతి భద్రతలు , తదితర అంశాలపై అధికార విపక్షాలు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి.

English summary

Government Of Andhra Pradesh Has Decided for a Judicial inquiry on Cal Money Case in Andhra Pradesh