సినీనటుడు రమణమూర్తి ఇకలేరు

JV Ramana Murthy has been expired

03:26 PM ON 23rd June, 2016 By Mirchi Vilas

JV Ramana Murthy has been expired

సీనియర్ సినీనటుడు, 'కన్యాశుల్కం' నాటకంలో సుప్రసిద్ధ పాత్ర 'గిరీశం' లో సుస్థిరస్థానాన్ని పొందిన జేవీ రమణమూర్తి కన్నుమూశారు. హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. సుప్రసిద్ధ నటులు, 'శంకరాభరణం' శంకరశాస్త్రిగా పేరుపొందిన జొన్నలగడ్డ వెంకట సోమయాజులు ఈయనకు అన్నయ్య. రమణమూర్తిగా ప్రసిద్ధులైన జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి సుప్రసిద్ధ రంగస్థల-సినీనటుడు. ఈయన విజయనగరం జిల్లాలో 1933 మే 20న జన్మించారు.

తన పాఠశాల జీవితం నుంచే నటనా ప్రస్థానం ప్రారంభించారు. ఇంటర్ యూనివర్శిటీ పోటీలలో 'ఆత్రేయ విశ్వశాంతి' అవార్డు పొందారు. 'ఎవరు దొంగ', 'కప్పలు', 'కీర్తిశేషులు', 'కాళరాత్రి', 'ఫాణి', 'కాటమరాజు కథ' వంటి నాటకాలలో నటించారు. గురజాడ అప్పారావు రాసిన 'కన్యాశుల్కం'లో 'గిరీశం' పాత్ర ఈయనకు గుర్తింపు తెచ్చింది. చలనచిత్ర పరిశ్రమలో ఎం.ఎల్.ఏ.(1957) సినిమాతో నటనా ప్రస్థానం ప్రారంభించి, దాదాపు 150 చిత్రాల వరకు నటించారు. నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం 2015 సంవత్సరానికి గాను జె.వి. రమణమూర్తి(సాంఘిక నాటకం)కి అందజేశారు.

2004లో 'ఆర్య' చిత్రంలో ఈయన చివరిసారిగా నటించారు. ఈయన మరణం పట్ల పలువురు తీవ్ర సంతాపం తెలిపారు.

English summary

JV Ramana Murthy has been expired