మట్టివాసనతో పులకించిన  కెసిఆర్

KCR Medak District Tour

10:46 AM ON 12th January, 2016 By Mirchi Vilas

KCR Medak District Tour

చిన్ననాటి స్నేహితులు, విద్య నేర్పిన గురువులను చూసి పులకించిపోయారు తెలంగాణా సిఎమ్ కెసిఆర్. గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, కొత్త ఆలోచనలను వారితో పంచుకున్నారు. వినమ్రంగా గురువులకు నమస్కరించారు. పాదాభివందనం చేసారు. ఇంతకీ విషయమేమంటే, మెదక్ జిల్లా  దుబ్బాకలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు విద్య నేర్పిన గురువులు, స్నేహితులు అంతా కల్సి , అక్కడి  బాలాజీ వెంకటేశ్వర ఆలయంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్ గురువులు గన్నె బాల్‌రెడ్డి, సి నారాయణలకు కెసిఆర్  పాదాభివందనం చేశారు. గురువులు, సన్నిహితులను ఆత్మీయంగా పలకరించి, ఆలింగనం చేసుకున్నారు. తన గురువు మృత్యుంజయ శర్మ, విద్యాబుద్ధులు నేర్పిన దుబ్బాక గడ్డను ఎప్పటికీ మరవనని చెప్పారు. మిత్రునిగా, శిష్యుడిగా శాయశక్తులా సహకరించడం తన ధర్మమని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. చిన్ననాటి మిత్రులు, గురువులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వేంకటేశ్వరాలయ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే కామన్‌గుడ్ ఫండ్ కింద ఇచ్చిన రూ.2.50 కోట్లతో పాటు, అదనంగా మరో రూ.3 కోట్లను మంజూరు చేస్తున్నట్లు కెసిఆర్ ప్రకటించారు.

కెసిఆర్ మిత్రులు పొలిశెట్టి లక్ష్మీనారాయణ, చింత లక్ష్మినర్సయ్య, గొల్ల జగదీశ్వర్, గొల్ల గోపాల్, చింత గాలయ్య, నల్ల నాగరాజం, చిన్నకోడూరు భూపతి రెడ్డి, చెల్లాపూర్ నుంచి విచ్చేసిన బాల్యమిత్రులను యోగక్షేమాలు అడిగితెలుసుకున్నారు.

మరోసారి  వెంకటేశ్వరాలయ పూజా కార్యక్రమాలకు వస్తానని, అప్పుడు ఒకరోజు ఉంటానని కెసిఆర్  హామీ ఇచ్చారు. దుబ్బాకలోని మిత్రులు, గురువులతో తన వ్యవసాయ క్షేత్రంలో ఓ రోజు కలిసి భోజనం చేసి యోగక్షేమాలు మాట్లాడుకుందామని,పేర్కొంటూ ,  చెప్పిన రోజు అందరూ రావాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

మన నిధులు  మనకే ఖర్చవుతాయని ఉద్యమ సమయంలో చెప్పానని కెసిఆర్ గుర్తుచేస్తూ,  ప్రస్తుతం వంద శాతం అదే జరుగుతోందన్నారు.  ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్‌ రూ. 1.60 లక్షల కోట్లని, ఇందులో ప్రణాళికేతర వ్యయం పోగా అభివృద్ధి పనుల కోసం రూ.48 వేల కోట్లు మాత్రమే అందించారని, కానీ వచ్చే బడ్జెట్‌లో తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాల కోసమే రూ. 62 వేల కోట్లు కేటాయిస్తున్నామన్నాగతంలో 23 జిల్లాలకు ఇచ్చినదానికంటే ఇది చాలా ఎక్కువ అని కెసిఆర్ చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధికి కనీసం పది శాతం కూడా నిధులు వెచ్చించలేదని విమర్శించారు.అనంతరం ఆయన దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి సమీక్షలో మాట్లాడారు.

తాను దేవునిబావిలో వందలసార్లు ఈత కొట్టానని, తొమ్మిదో తరగతిలో ఉండగా ఇఖ్కడే రామసముద్రం చెరువు కట్ట పైన కూర్చొని ఉత్పలమాల, చంపకమాల పద్యాలు రాశానని, ఈ మట్టిలో బోర్లాడినానని కెసిఆర్ గుర్తు చేసుకున్నారు. మొత్తానికి మట్టివాసన ఎలా వుంటుందో ఆయన మరోసారి చవిచూశారు. పులకించిపోయారు.

1/5 Pages

English summary

Telangana state Cheif Minister Kalavakuntla Chandra Sekahar Rao(KCR) Visits his village in medak district.He grants a new building and soo many other things to that village